పరకాల: పరకాల మండలం మలక్పేట గ్రామానికి చెందిన కుమారస్వామి (పాలేరు) విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందిన ఘటన మాదారం శివారు ప్రాంతంలో విషాదాన్ని నింపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదారం శివారులోని భూమి యజమాని పిట్ట సమ్మయ్య వద్ద కుమారస్వామి పాలేరుగా పనిచేస్తున్నాడు. రోజువారీగా పనిలో భాగంగా మంగళవారం ఉదయం మోటార్ వేయడానికి వెళ్లిన కుమారస్వామికి విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పిట్ట సమ్మయ్య భార్య గ్రామంలోని వారికి సమాచారం అందించినట్లు స్థానికులు పేర్కొన్నారు. విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో విషాద వాతావరణం నెలకొంది. మృతుడు కుమారస్వామికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నట్లు స్థానికులు తెలిపారు. రజక సామాజిక వర్గానికి చెందిన కుమారస్వామి కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని, కుటుంబానికి ఆధారమైన వ్యక్తిని కోల్పోవడంతో భార్యాపిల్లల పరిస్థితి దయనీయంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి మృతుడి కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించడంతో పాటు కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని వారు కోరారు. విద్యుత్ ప్రమాదాల నివారణకు అధికారులు క్షేత్రస్థాయిలో భద్రతా చర్యలు మరింత పటిష్టం చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.
