Monday, September 14, 2026

చిన్న వర్షానికే చెరువులుగా పరకాల రోడ్లు.. మున్సిపాలిటీ పనితీరుపై ప్రజల ఆగ్రహం

పరకాల, సెప్టెంబర్ 13 (పిసిడబ్ల్యూ న్యూస్): పట్టణంలో కొద్దిపాటి వర్షం కురిసినా ప్రధాన రహదారులు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా భూపాలపల్లి రోడ్డులో చిన్న వర్షానికే భారీగా నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు అవస్థలు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి, వర్షపు నీరు సులభంగా వెళ్లేలా చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం ఎందుకు చూపడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పట్టణం అభివృద్ధి దిశగా ముందుకు సాగాల్సిన సమయంలో పారిశుద్ధ్యం, డ్రైనేజీ, రహదారుల నిర్వహణపై నిర్లక్ష్యం కనిపిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. చిన్న వర్షానికే రోడ్లు చెరువులను తలపిస్తుండటంతో పట్టణ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల చెత్త పేరుకుపోవడం, మురుగు నీరు నిలిచిపోవడం వంటి సమస్యలు కూడా ప్రజలకు ఇబ్బందిగా మారుతున్నాయని చెబుతున్నారు. సమస్యలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, తాత్కాలిక చర్యలకు పరిమితం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి భూపాలపల్లి రోడ్డుతో పాటు పట్టణంలోని నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

Related Articles

Latest Articles