పిసిడబ్ల్యూ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి: పరకాల పట్టణంలోని జయ డీలక్స్ రోడ్డులో ఉన్న ఆర్కే సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ దుకాణంలో ఈ నెల సుమారు 15 రోజుల క్రితం పలువురు రైతులు డీఎస్పీఎల్ కంపెనీకి చెందిన దామిని–541 మిరప విత్తనాలను దాదాపు రూ. లక్షకు పైగా విలువతో కొనుగోలు చేశారు. అయితే విత్తిన అనంతరం సాధారణంగా నాలుగు నుంచి పదకొండు రోజుల్లో మొలకెత్తాల్సిన విత్తనాలు ఇప్పటివరకు మొలకెత్తకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం బాధిత రైతులు ఆర్కే సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ దుకాణం ఎదుటకు చేరుకుని తమ ఆవేదనను వ్యక్తం చేశారు. నాణ్యమైన విత్తనాల పేరుతో విక్రయించి తమను ఆర్థికంగా నష్టపరిచారని, ఇప్పటికే సాగు ఖర్చులు పెరిగిన పరిస్థితుల్లో ఇలాంటి ఘటనతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు వాపోయారు. విత్తనాలు మొలకెత్తకపోవడంతో తిరిగి విత్తనాలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దీనివల్ల సమయం, శ్రమ, పెట్టుబడి అన్నీ వృథా అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే స్పందించి సంబంధిత విత్తనాల నాణ్యతపై సమగ్ర విచారణ చేపట్టాలని, బాధ్యులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. అలాగే తమకు జరిగిన ఆర్థిక నష్టాన్ని అంచనా వేసి పూర్తి స్థాయిలో పరిహారం అందించాలని కోరారు. రైతుల కష్టార్జిత పెట్టుబడులతో చెలగాటమాడే వారిపై ఉదాహరణాత్మక చర్యలు తీసుకున్నప్పుడే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని రైతులు హెచ్చరించారు.
