పిసిడబ్ల్యూ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి: పరకాల పట్టణంలోని ఓ ప్రముఖ ప్రైవేట్ పిల్లల ఆస్పత్రికి అనుబంధంగా కొనసాగుతున్న మెడికల్ షాపులో మందులను అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ఆస్పత్రి వైద్యుడు సూచించిన మందులను తప్పనిసరిగా అదే మెడికల్ షాపులో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొందని కొందరు రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఇతర మెడికల్ షాపులతో పోలిస్తే కొన్ని మందులకు అధిక ధరలు వసూలు చేస్తున్నారని వారు వాపోతున్నారు. అదేవిధంగా అవసరానికి మించి మందులు సూచిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో సాధారణ కుటుంబాలపై చికిత్స ఖర్చు భారం పెరుగుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 26 ఏళ్ల వైద్య అనుభవం ఉన్న వైద్యుడిపై ప్రజలకు విశ్వాసం ఉన్నప్పటికీ, ప్రస్తుతం వినిపిస్తున్న ఆరోపణలపై స్పష్టత అవసరమని స్థానికులు అంటున్నారు. మరోవైపు, కొందరు రోగుల కుటుంబ సభ్యులు పిల్లల ఆరోగ్యం విషమించిన పరిస్థితుల్లో సరైన వైద్య సేవలు అందుతున్నాయా అనే అంశంపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చికిత్సపై సందేహాలు ఉన్నప్పుడు తల్లిదండ్రులకు వివరణాత్మక సమాచారం అందించకుండా డిశ్చార్జ్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెంటనే స్పందించి మెడికల్ షాప్ బిల్లులు, మందుల MRP, విక్రయ ధరలు, ప్రిస్క్రిప్షన్లు, ఆస్పత్రి–మెడికల్ షాప్ వ్యవహారాలపై సమగ్ర విచారణ చేపట్టాలని పరకాల ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా ఈ పిల్లల ఆసుపత్రిలో స్పెషాలిటీ ఏమిటంటే ఎవరైనా పిల్లలకు రెండు రోజుల్లో చికిత్స సరిగా అందకపోయినా విషమించిన ముందుగా పసిగట్టి మూడో వ్యక్తి తెలియకుండా పిల్లల తల్లిదండ్రులకు మోటివేషన్ చేసి పాపను గాని బాబును గానీ డిశ్చార్జ్ చేసే తెలివి వీరికి పుట్టుకతో వచ్చిన విద్య లు అని స్థానికులు ఆరోపిస్తున్నారు.
