పరకాల: పరకాల పట్టణంలోని ఆర్కే సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ దుకాణంలో వ్యవసాయ శాఖ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. కొందరు రైతులు వ్యక్తం చేసిన సందేహాల నేపథ్యంలో అధికారులు సుమోటోగా స్పందించి పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా నడికూడ మండలం వరకోలు గ్రామానికి చెందిన రైతులు గాజుల రాజు, జంగే శ్రీనివాస్, పగిడే రతన్‌రావు, డైగ రాజేశ్వర్‌రావు, కట్రపల్లి శంకర్, పద్మలను పిలిపించి వారు కొనుగోలు చేసిన విత్తనాల బిల్లులను పరిశీలించారు. అనంతరం వారి వాంగ్మూలాలను నమోదు చేశారు. రైతులు ఇచ్చిన వివరాల ప్రకారం తమ పొలాల్లో మిర్చి విత్తనాల మొలక శాతం సంతృప్తికరంగా, సుమారు 90 శాతం వరకు నమోదైందని అధికారులు తెలిపారు. అనంతరం రైతుల సమక్షంలో పంచనామా నిర్వహించి దామిని–541 మిర్చి విత్తనాల నమూనాలను సేకరించారు. వాటిని నాణ్యత పరీక్షల కోసం హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ విత్తన పరీక్షా కేంద్రానికి పంపించారు. ల్యాబ్ నివేదిక వచ్చిన తర్వాతే విత్తనాల నాణ్యతపై తుది నిర్ణయం తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. నాణ్యతలో లోపాలు లేదా నిబంధనల ఉల్లంఘన ఉన్నట్లు తేలితే సంబంధిత వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే నకిలీ విత్తనాలు విక్రయించడం, బిల్లు లేకుండా అమ్మకాలు జరపడం వంటి అక్రమాలకు పాల్పడే డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఈ తనిఖీల సందర్భంగా ఆర్కే సీడ్స్ యాజమాన్యం అధికారులకు పూర్తిగా సహకరించి, అవసరమైన బిల్లులు, రికార్డులు, విత్తన నమూనాలను అందజేసింది. నాణ్యతపై ఎలాంటి సందేహాలున్నా అధికారుల విచారణకు సహకరిస్తూ రైతుల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఆర్కె సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ యజమాని రాజు మాట్లాడుతూ రైతుల పక్షాన నేనుంటాను రైతులకు ఏలాంటి నష్టం కలిగించెను నేను వారికి భరోసా ఇస్తానని ఈ సందర్భంగా వారు అన్నారు.
