పిసిడబ్ల్యూ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి: పరకాల పట్టణంలోని హుజురాబాద్ రోడ్డులో ఎడమవైపున ఉన్న వైన్ షాప్ ముందు టూ వీలర్ వాహనాలను విచ్చలవిడిగా పార్కింగ్ చేయడం వల్ల తరచూ ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారిపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం సమీపంలో మూలమలుపు ఉండటంతో దృష్టి సరిగా పడక ప్రమాదాల ముప్పు మరింత పెరుగుతోందని వారు పేర్కొంటున్నారు. వైన్ కొనుగోలుదారులు రోడ్డుపైనే ద్విచక్ర వాహనాలను నిలిపివేయడంతో ఇతర వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై పరకాల కౌన్సిలర్ పూర్ణచారి స్పందిస్తూ, ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ వైన్ షాప్ వ్యవహారాన్ని అధికారులు అత్యంత సీరియస్‌గా తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వైన్ షాపులు విద్యాసంస్థలు, దేవాలయాలు వంటి ప్రజలు అధికంగా రాకపోకలు సాగించే ప్రాంతాలకు దూరంగా ఉండాల్సి ఉంటుందని ఆయన గుర్తు చేశారు. అయినప్పటికీ ఈ ప్రాంతంలో వైన్ షాప్ కొనసాగుతుండటం వల్ల నిత్యం ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయని అన్నారు. వైన్ షాప్ పక్కనే ఉన్న ఆగ్రోస్ ఏజెన్సీ నిర్వాహకులు, వినియోగదారులు కూడా పార్కింగ్ సమస్యతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని తెలిపారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని వెంటనే ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని, వైన్ షాప్ ముందు అక్రమ పార్కింగ్‌ను పూర్తిగా అరికట్టాలని, అవసరమైతే షాప్ స్థాన మార్పుపై కూడా అధికారులు పరిశీలించాలని ఆయన కోరారు. ప్రజల ప్రాణాల కంటే వ్యాపారం ముఖ్యమా అని స్థానికులు ప్రశ్నిస్తూ, ప్రమాదాలకు కారణమవుతున్న ఈ పరిస్థితిపై జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.
