పిసిడబ్ల్యూ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ రీజియన్ ఆర్టీసీలో గత ఏడాది కాలంగా విధులు నిర్వహిస్తున్న సుమారు 90 మంది కాంట్రాక్ట్ కండక్టర్లను ఎలాంటి ముందస్తు సమాచారం, నోటీసు లేకుండా అకస్మాత్తుగా విధుల నుంచి తొలగించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏడాది కాలంగా తమ సేవలను వినియోగించుకుని, ఇప్పుడు ఒక్కసారిగా ఉద్యోగాల నుంచి తొలగించడం తీవ్ర అన్యాయమని బాధిత కాంట్రాక్ట్ కండక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ నిర్వహించిన పలు కీలక కార్యక్రమాలతోపాటు మేడారం మహాజాతర సమయంలోనూ విధులు నిర్వహించి సంస్థకు సేవలందించామని వారు తెలిపారు. విధుల్లో ఉన్న సమయంలో తమపై ఆధారపడిన కుటుంబాల ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండా అకస్మాత్తుగా ఉద్యోగాలు తొలగించడంతో జీవనోపాధి ప్రశ్నార్థకంగా మారిందని వాపోతున్నారు. ఇదిలా ఉండగా.. తమను విధుల్లోకి తీసుకునే సమయంలో కొందరి నుంచి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకున్నారా? తీసుకున్నట్లయితే ఎవరి ద్వారా, ఏ స్థాయిలో ఈ వ్యవహారం జరిగిందనే విషయాలపై సమగ్ర విచారణ జరిపించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత అధికారుల వివరణ తెలియాల్సి ఉంది. ఏడాది పాటు పనిచేయించుకున్న తర్వాత కనీస సమాచారం ఇవ్వకుండా విధుల నుంచి తొలగించడం వెనుక కారణాలను ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పష్టం చేయాలని వారు కోరుతున్నారు. తమను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవడంతోపాటు, ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి బాధిత కాంట్రాక్ట్ కండక్టర్ల కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నారు.
