Thursday, August 27, 2026

సీఎం సార్‌.. మా గోడు ఆలకించండి

పిసిడబ్ల్యూ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి: గంగిరెడ్ల కులానికి చెందిన తమను ఎస్సీ లేదా ఎస్టీ జాబితాలో చేర్చి సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం అండగా నిలవాలని ఆ కులస్థులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. తమ కులానికి సంబంధించిన సమస్యలను ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ఎన్నో ఏళ్లుగా వెనుకబాటుతనాన్ని ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంగిరెడ్ల కులానికి చెందిన వారిలో కనుకుంట్ల ఇంటిపేరు ఉన్న కుటుంబాలు కూడా ఉన్నాయని వారు పేర్కొన్నారు. తమ సామాజిక పరిస్థితులను సమగ్రంగా పరిశీలించి, తమను సరైన రిజర్వేషన్‌ జాబితాలో చేర్చి న్యాయం చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం తమ కులాన్ని బీసీ-ఏ జాబితాలో చేర్చినప్పటికీ, ఆ రిజర్వేషన్‌ వల్ల తమకు ఆశించిన స్థాయిలో ప్రయోజనం కలగడం లేదని సారయ్య, అనిల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్య, ఉద్యోగాలు, ఆర్థిక అవకాశాల్లో తమ పిల్లలు వెనుకబడుతున్నారని, పేదరికం కారణంగా ఉన్నత విద్యను కొనసాగించలేకపోతున్నారని తెలిపారు. తరతరాలుగా ఎదుర్కొంటున్న వెనుకబాటుతనాన్ని తొలగించేందుకు ప్రత్యేక చర్యలు అవసరమని అన్నారు.“సీఎం సార్‌.. మా పరిస్థితిని ఒకసారి పరిశీలించండి. మా కులం ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేయించి, అర్హత ఉంటే ఎస్సీ లేదా ఎస్టీ జాబితాలో చేర్చి మమ్మల్ని ఆదుకోవాలి. మా పిల్లలకు విద్య, ఉద్యోగాల్లో మెరుగైన అవకాశాలు కల్పించాలి” అని గంగిరెడ్ల కులస్థులు ప్రాధేయపడుతున్నారు. తమ డిమాండ్‌పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, సంబంధిత అధికారులతో సమగ్ర సర్వే నిర్వహించి వాస్తవ పరిస్థితులను వెలుగులోకి తేవాలని వారు కోరారు. ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకుని తమకు న్యాయం చేయాలని గంగిరెడ్ల కులస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. “రిజర్వేషన్‌ జాబితాలో సరైన గుర్తింపు.. మా భవిష్యత్‌కు భరోసా” అని వారు పేర్కొన్నారు.

Related Articles

Latest Articles