హనుమకొండ ప్రతినిధి: అక్టోబర్ 7 (నేటితరం) గ్రామీణ తపాలా ఉద్యోగులకు కనీస వేతనాన్ని అమలు చేసి, కనీస సౌకర్యాలు కల్పిస్తూ కమలేష్‌చంద్ర కమిటీ అనుకూల సిఫారసులను అమలు చేయాలని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కి గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు బొద్దున వెంకటేశ్వర్లు సంఘం నేతలతో కలిసి వినతిపత్రం అందించారు. ఈ మేరకు ఏపీలోని విజయవాడలో మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంత్రిని కలిసి పలు సమస్యలు వివరించారు. గ్రామీణ తపాలా ఉద్యోగులు మెడికల్, కనీస పెన్షన్ సౌకర్యం లేకుండా గ్రామీణ ప్రాంత ప్రజలకు నిరంతరం ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుని విలువైన సేవలు అందిస్తున్నారని మంత్రికి వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో పోస్టాఫీస్‌లను తమ ఇళ్లలో నిర్వహిస్తున్నామని, అందుకు సరైన ఇంటి అద్దె, న్యాయమైన అలవెన్స్ లేదని, ఉద్యోగ విరమణ తర్వాత కనీస పెన్షన్ కూడా లేదని పేర్కొన్నారు. సీనియర్లకు 12, 24, 36 ఏళ్ల సర్వీస్‌కు సరియైన ఆర్థిక ఇంక్రిమెంట్లు న్యాయంగా అమలు కావడంలేదని, పేరుకు 5గంటల పనిగంటలతో నియమించ బడినా.. రోజుకు 8 గంటల నుంచి 10గంటలపాటు పనిచేయాల్సి వస్తోందని, కనుక గ్రామీణ తపాల ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే దిశగా ఆలోచించాలని విన్నవించారు. ప్రతీ బ్రాంచ్ ఆఫీస్‌లో ఎస్‌బీ, ఆర్డీ, సుకన్య, ఐపీపీబీ, ఎన్ఆర్ ఈజీఎస్, ఆర్పీఎల్ఐ అకౌంట్లను వేల సంఖ్యలో నిర్వహించ డమేగాక, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలులో జీడీఎస్‌లు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారని వివరించారు. పెరిగిన పనిభారంకు తగిన వేతనం రావడం లేదని, అందుకు తగు సానుకూల నిర్ణయాలతో దేశంలోని మూడు లక్షల మంది గ్రామీణ తపాలా ఉద్యోగులకు న్యాయం జరిగే దిశగా ఆలోచించాలని కోరారు. అయితే, ఏఐజీడీఎస్ నేతల వినతిమేరకు స్పందించిన మంత్రి.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐజీడీఎస్‌యూ తెలంగాణ అసిస్టెంట్ సర్కిల్ సెక్రటరీ పెరుమాండ్ల తిరుపతి, హన్మకొండ డివిజన్ కోశాధికారి జే బాపూజీ, మర్రి కొమురారెడ్డి తదితరులు పాల్గొన్నారు.