ఖమ్మం ప్రతినిధి, (పి సి డబ్ల్యూ న్యూస్ ) : ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి దసరా సెలవులను సంపూర్ణంగా అమలు చేయని ప్రైవేట్ స్కూల్స్ పైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం జిల్లా అధ్యక్షులు కొరకొప్పు రామారావు జిల్లా విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ముందు దసరా సెలవులను సంపూర్ణంగా అమలు చేయాలని టిపిటిఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర్ శర్మ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కొరకొప్పు రామారావు మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ, దసరా పండగల సందర్భంగా అక్టోబర్ 2 నుండి 14 వరకు సంపూర్ణమైన సెలవులను ప్రకటించిందన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పండగ సెలవులను కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు సంపూర్ణంగా అమలు చేయకుండా విద్యార్థులను, విద్యార్థుల తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయించి ఇచ్చే పండుగ సెలవులను పలు ప్రైవేట్ విద్యాసంస్థలు సాంప్రదాయాలను తుంగులో తొక్కుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర్ శర్మ మాట్లాడుతూ.. దసరా సెలవులలో పాఠశాలలను నడిపే యజమాన్యాలపై శాఖపరమైన చర్యలతో పాటు లక్ష రూపాయలు జరిమానా విధిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిపిటిఎఫ్ నాయకులు చౌహాన్ చౌదరి, జి. నాగరాజు, బి. కోటేశ్వరరావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.