పొరపాట్లు లేకుండా సజావుగా కుటుంబ వివరాలు సేకరించాలి- జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
పెద్దపల్లి, అక్టోబర్ -04 (పిసిడబ్ల్యూ న్యూస్) జిల్లాలో చేపట్టిన ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే పైలట్ ప్రాజెక్టు కింద ఎటువంటి పొరపాట్లు లేకుండా కుటుంబ వివరాలను సజావుగా సేకరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పెద్దపల్లి పట్టణం 24వ వార్డులో జరుగుతున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలెట్ ప్రాజెక్టు సర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. గుప్తా హాస్పిటల్ రోడ్, సంతోషిమాత దేవాలయం ఎదురుగా 24వ వార్డులో జరుగుతున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వేను కలెక్టర్ పరిశీలించారు. సర్వే ద్వారా కుటుంబాల నుంచి సేకరిస్తున్న వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నిర్దేశించిన సమాచారాన్ని పూర్తిస్థాయిలో కుటుంబం దగ్గర నుంచి సేకరించాలని, 24వ వార్డులో ఏ కుటుంబాన్ని విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరి వివరాలను పకడ్బందీగా సేకరించి నమోదు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలెట్ ప్రాజెక్టు సర్వే పనులు అక్టోబర్ 8 లోపు పూర్తి చేయాలని, వార్డులో ఉన్న కుటుంబాల సంఖ్య ఆధారంగా ప్రతిరోజు ఎన్ని కుటుంబాలను కవర్ చేయాలో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుని బృందాలు పనిచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.