అరుంధతి మాదిగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ జయంతి వేడుకలు
హనుమకొండ (పిసి డబ్ల్యూ న్యూస్) అరుంధతి మాదిగ కుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సంఘం అధ్యక్షులు సిలువెరు విజయభాస్కర్ పాల్గొని మాట్లాడుతూ.. బాబూజీ గా ప్రసిద్ధి చెందిన జగ్జీవన్ రామ్ జాతీయ నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, సామాజిక న్యాయ పోరాట యోధుడు, అణగారిన వర్గాల ఆశాదీపం, విశిష్ట పార్లమెంటేరియన్, నిజమైన ప్రజాస్వామ్యవాది, విశిష్ట కేంద్ర మంత్రి, సమర్థ పరిపాలనాదక్షుడు గా సేవలందించాడని అన్నారు అలాగే బాబుజీగా ప్రఖ్యాతిగాంచిన జగ్జీవన్ రామ్ అంటరానివారి శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దళిత చిహ్నం. ఏప్రిల్ 5వ తేదీ ఆయన జయంతి. ఒక సామాన్య రైతు కుటుంబంలో 1908 ఏప్రిల్ 5న బాబూ జగ్జీవన్ రామ్ జన్మించారు. ఆయన తండ్రి శోబీరామ్, తల్లి వసంతిదేవి. బీహార్‌లోని షాహాబాద్ (ఇప్పుడు భోజ్‌పూర్) జిల్లాలోని చంద్వా అనే చిన్న గ్రామంలో జన్మించారు. ఆయనకు అన్నయ్య సంత్ లాల్ తోపాటు ముగ్గురు అక్కచెల్లెళ్లు ఉన్నారు. జగ్జీవన్ రామ్ అర్రా టౌన్ స్కూల్ నుండి మెట్రిక్యులేషన్ మొదటి విభాగంలో ఉత్తీర్ణుడయ్యాడు. కుల ఆధారిత వివక్షను ఎదుర్కొంటున్నప్పటికీ, జగ్జీవన్ రామ్ బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి ఇంటర్ సైన్స్ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసి, తరువాత కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాడు.1936-1986 మధ్య 50 సంవత్సరాల పాటు నిరంతరాయంగా పార్లమెంటు సభ్యుడిగా ప్రపంచ రికార్డు సాధించారు. అత్యంత గౌరవనీయమైన దళిత నాయకులలో ఒకరైన జగ్జీవన్ రామ్ 1971 భారత-పాకిస్తాన్ యుద్ధంలో భారత రక్షణ మంత్రిగా పనిచేశారు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో జగ్జీవన్ రామ్ ఉత్సాహంగా పాల్గొనే వారు. అని అన్నారు. సామాజిక సమానత్వంపై అందరినీ చైతన్య పరిచేందుకు 1934లో ఆలిండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్, అఖిల్ భారతీయ రవిదాస్ మహాసభలకు పునాది వేశారు అని అన్నారు అలాగే.. 1935 అక్టోబర్ 19న దళితులకు ఓటు హక్కు కోసం హమ్మండ్ కమిషన్ ముందు వాదనలు వినిపించారు. బ్రిటిష్ అధికారులపై అసమ్మతి చర్యలతో 1940లో అరెస్టయ్యారు. రాజ్యాంగ సభలో సభ్యుడిగా ఆయన పాత్ర ఎనలేనిది. దళితుల సామాజిక, రాజకీయ హక్కుల కోసం ఆయన వాదించారు. 1946లో జవహర్ లాల్ నెహ్రూ ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వ కేబినెట్లో అతి చిన్న వయసులో మంత్రి అయ్యారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశానికి తొలి కార్మిక మంత్రిగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. 1940 నుంచి 1977 వరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అనుబంధ సభ్యునిగా.. 1948 నుంచి 1977 వరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ప్రతినిధిగా కూడా పనిచేశాడు. కమ్యూనికేషన్స్, రైల్వే, రవాణా, ఆహార, వ్యవసాయం, రక్షణ వంటి కీలక శాఖల బాధ్యతలు కూడా నిర్వహించారు. దేశంలో హరిత విప్లవం విజయవంతం చేయడంలో జగ్జీవన్ రామ్ కీలకపాత్ర పోషించారు. అలాగే జనతా పార్టీ ప్రభుత్వంలో 1977 నుంచి 1979 వరకు ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్(ఇందిరా) పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 1936 నుంచి 1986 వరకు ఐదు దశాబ్దాలకుపైగా చట్ట సభ సభ్యుడిగా కొనసాగడం ప్రపంచ రికార్డు. స్వతంత్ర భారతదేశంలో తొలి ఎన్నికలు జరిగిన 1952 నుంచి ఆయన చనిపోయే 1986 వరకూ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. దేశంలో ఎక్కువ కాలం పనిచేసిన కేబినెట్ మంత్రిగానూ ఆయన రికార్డు సృష్టించారు. ఈ కార్యక్రమంలో అరుంధతి మాదిగ కుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి దుప్పటి శివకుమార్, కాళేశ్వరి సుదర్శన్, ఉప కోశాధికారి సదరం మహేశ్వరరావు మాజీ కార్పొరేటర్ గోల్కొండ రాంబాబు,సల్లూరి నాగేశ్వరరావు, అన్నంపల్లి రాజ్ కుమార్, గోల్కొండ రామచందర్, నర్మెట్ట వేణు, మాతంగి స్వామి, ఎదునూరి రవి కిరణ్, గోల్కొండ అన్వేష్, గోల్కొండ అరవింద్,గాజుల ప్రసాద్, జన్ను ఐలేష్, గుర్రపు దయాకర్, చుండూరు వాసు, సుంక సతీష్, కట్కూరి శ్రీను, నల్ల మహేష్, కొమ్ము మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.