నడికూడ, ఫిబ్రవరి 22 (పిసిడబ్ల్యూ న్యూస్): కంటాత్మకూర్ సమ్మక్క సరళమ్మ జాతర వనమంతా జన జాతరగా మారింది. జాతరలో మరో ప్రధాన అంకం ప్రారంభమైంది. సారలమ్మ బుధవారం రాత్రి గద్దెపైకి చేరింది. సమ్మక్క గద్దె మీదకు రానున్న నేపథ్యంలో భక్తుల తాకిడి పెరిగింది. భక్తజనంతో జాతర పోటెత్తింది. సమ్మక్కను తీసుకురావడంతో రెండవరోజు జాతరలో రెండవ ఘట్టం ఆవిష్కృతమైంది. జాతర ప్రాంగణానికి కిలోమీటర్ల దూరంలో ఉన్న సమ్మక్క గుట్ట ఆలయంలో కొలువైన సమ్మక్కను అంగరంగవైభవంగా గద్దెపైకి తోడుకొని వచ్చారు. గురువారం మధ్యాహ్నమే చేరుకున్న వడ్డెలు రెండు గంటలపాటు సంప్రదాయ పద్ధతిలో డోలు చప్పుళ్ల మధ్య పూజలు చేశారు. పిల్లలు లేనివారు, దీర్ఘకాలిక రుగ్మతలతో భాదపడేవారు పుణ్యస్నానాలు ఆచరించి తడిబట్టలతో గుడిబయట పడుకుంటే దేవతను తీసుకొచ్చే పూజారులు వారిపైనుంచి నడిచి వెళ్ళారు. శివ సత్తుల పూనకాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. గద్దెల వద్దకిబయలుదేరిన సారలమ్మకు చుట్టుపక్కల గ్రామాల ఆడపడుచులు మంగళహారతి ఇచ్చి సాగనంపారు. దీనికి ముందే పగిడిద్దరాజు గద్దెలపైకి చేరుకున్నారు. తొలిరోజు గోవిందరాజులు, పగిడిద్దరాజు, సమ్మక్కను ముగ్గురు గద్దెలపై పూజలందుకుంటున్నారు. నల్లాల వద్ద పుణ్యస్నానాలు ఆచరించి భక్తులు మొక్కులు సమర్పించేందుకు పోటీ పడుతున్నారు.భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. జాతరలో పోటెత్తిన భక్తజనం వేకువజామున నుండే భక్తుల తాకిడితో సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం కిటకిట లాడుతున్నాయి. వనదేవతల రాక సందర్భంగా సర్వాంగ సుందరంగా గద్దెల ప్రాంగణాన్ని ముస్తాబు చేశారు. ప్రధాన ద్వారం వద్ద వివిధ రకాల పూలతో ఏర్పాటు చేసిన అమ్మ వారి అలంకరణ భక్తులను ఆకట్టుకుంటున్నది. తలుచుకుంటేనే కరుణించే తల్లులు సమ్మక్క సారాలమ్మలు. అట్లాంటి తల్లుల దర్శనం కోసం మండలంలోని వివిధ గ్రామాల నుండి భక్తులు వస్తున్నారు. అమ్మదేవతలు గద్దెలకు వచ్చే సమయం కోసం వేచి చూస్తున్న భక్తులు పులకించి పోయారు.