వైజాగ్ ప్రత్యేక ప్రతినిధి: ఆంధ్ర పెరియార్ డాక్టర్ జయ గోపాల్ ఇక లేరు. -పార్థివ దేహం మెడికల్ కళాశాలకు దానం. భారత నాస్తిక సమాజం వ్యవస్థాపకులు, అంతర్జాతీయ మానవ హక్కుల నేత, సాంస్కృతిక ఉద్యమకారుడు ఆంధ్ర పెరియార్ గా పేరు గాంచిన డాక్టర్ జయ గోపాల్ బుధవారం సాయంత్రం స్వగ్రామంలో తుది శ్వాస విడిచారు. 1972, ఫిబ్రవరి 13న భారత నాస్తిక సమాజంను ఏర్పాటు చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా ఎనిమిది రాష్ట్రాల్లో నాస్తిక, హేతువాద ఉద్యమ వ్యాప్తి కోసం కృషిచేసి, అంతర్జాతీయ స్థాయిలో మానవ హక్కుల కార్యకర్తలను అండగా నిలబడుతూ ఉద్యమం చేశారు. 52 ఏళ్లుగా భారత నాస్తిక సమాజం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కుల, మత మూడ విశ్వాసాలకు వ్యతిరేకంగా మూఢనమ్మకాల నిర్మూలనకు కృషి చేస్తూ దళితులపైన దాడులకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలను జయ గోపాల్ చేపట్టారు. సాంస్కృతిక ఉద్యమాల నిర్మాణం ద్వారానే సమాజంలో మార్పు కోసం తన జీవితకాలం ఆయన చేసిన కృషి మరువలేనిది. దేశంలోనే మొదటిసారిగా అంతర్జాతీయ “బ్రేవ్ మైండ్ అవార్డు’ను జయ గోపాల్ అందుకున్నారు. మూఢనమ్మకానికి వ్యతిరేకంగా సైన్సును, భౌతిక వాద భావజాలాన్ని వ్యాప్తి చేయడం కోసం ఎన్నో రచనలు చేయడంతో పాటు సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (ఎస్ ఎస్ ఎఫ్ అనే సంస్థను స్థాపించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జయ గోపాల్ మృతి నాస్తిక, హేతువాద, మానవతా ఉద్యమాలకు తీరని లోటు. అంత్యక్రియలు గురువారం ఉదయం 11:00 గంటలకు ఆరిలోవలోని ఇంటి నుండి ఊరేగింపుగా బయలుదేరి పార్థివ దేహాన్ని మెడికల్ కళాశాలకు కుటుంబ సభ్యులు అప్పగించనున్నారు. జయ గోపాల్ అభిమానులు స్నేహితులు, కుటుంబ సభ్యులు, బానాసా సభ్యులు ప్రజా సంఘాల నేతలు అంతిమ యాత్రలో పాల్గొనాల్సిందిగా భానాస అధ్యక్ష కార్యదర్యులు టి శ్రీరామ్మూర్తి, వై సూకరాజు ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.