PCW News

ప్రీతం చూపు – పెద్దపల్లి వైపు

హైదరాబాద్: రాబోయే పార్లమెంటు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తం అవుతుంది. గాంధీభవన్లో పర్లమెంటి ఎన్నికలకు అభ్యర్థిత్వాన్ని నమోదు చేసుకునే ప్రక్రియ ముగిసింది. ఈ నెల 5వ తేదీన కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులతో ప్రదేశ్ ఎన్నికల కమిటీ సభ్యులు సమావేశం అవుతున్నారు. ఇప్పటికే డిసిసి అధ్యక్షుల నుంచి మూడు పేర్లను సూచించమని కోరగా ఆ వివరాలపై కూడా ఈ భేటీలో చర్చించనున్నారు. పార్లమెంట్ స్థానాల్లో కూడా అత్యధిక స్థానాలు గెలుచుకోవాలన్న వ్యూహాలతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. ప్రధానంగా ఉత్తర తెలంగాణలోని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గట్టి సత్తా చాటిన పెద్దపల్లి పార్లమెంట్ నుండి ఎవరు బరిలో నిలవనున్నారు అనే ఆసక్తి నెలకొంది. ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడుకు ఏడు అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అందుకే ఇది సునాయాసంగా గెలవగలిగే పార్లమెంటు స్థానంగా అందరూ నాయకులు భావిస్తున్నారు. ఇది ఎస్సి రిజర్వ్డ్ పార్లమెంట్ స్థానం కావడంతో ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ నాగరిగారి ప్రీతం ఈ నియోజకవర్గ నుంచి బరిలో ఉంటారని ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. తాను బరిలో ఉంటున్నానని గాంధీ భవన్లోని దరఖాస్తు కార్యాలయంలో పెద్దపల్లి ఎంపి అభ్యర్థిగా ప్రీతం దరఖాస్తు నమోదు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్ యుఐ, యూత్ కాంగ్రెస్, ఏఐసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ కన్వీనర్ గా రాష్ట్ర ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ గా 20 సంవత్సరాల అనుభవం ప్రీతం సొంతం. రేవంత్ రెడ్డి తో ఉండే సాహిత్యం, పెద్దపల్లి పార్లమెంట్ ముఖ్య నేతలు రాష్ట్ర మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, జిల్లా అధ్యక్షులు రాజ్ ఠాకూర్, మరో కీలక నేత ప్రేమ్ సాగర్ రావు లతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటం ప్రీతంకు కలిసి వచ్చే అంశంగా కనబడుతుంది. ఇదే పార్లమెంట్ పరిధిలో చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వివేక్ వెంకటస్వామి తన కుమారుడికి ఈ టికెట్టు ఇప్పించుట కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం ఒక కుటుంబంలో రెండు టికెట్లు ఇవ్వరాదు అనే నిబంధన అధిష్టానం దృష్టికి నేతలు తీసుకెళ్తున్నారు. ఇప్పటికే ఇదే పార్లమెంట్ పరిధిలో చెన్నూరు బెల్లంపల్లి లలో వెంకట్ స్వామి ఇద్దరు కుమారులు ఎమ్మెల్యేలుగా ఉండడం వివేక్ కుమారుడి టికెట్ ప్రయత్నాలకు అడ్డంకిగా మారనుంది.రాష్ట్రంలో ఉన్న ఎస్సీ రిజర్వేషన్ ఉన్న మూడు పార్లమెంటు స్థానాలకు గాను నాగర్ కర్నూల్ ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ను వరించనుండగ, వరంగల్ అద్దంకి దయాకర్ కు దాదాపు కరానైనట్టుగా విశ్వాసనీయ సమాచారం. ఇక మిగిలిన పెద్దపల్లిని మాదిగ సామాజిక వర్గానికి కేటాయించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం, ఢిల్లీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారులు మరియు స్పీకర్ పదవులు మాలలకు కేటాయించగా పార్లమెంటు ఎన్నికల్లో మాదిగలకు రెండు మరియు మాలకొకటి సీటు కేటాయించే అవకాశం ఉంది. పోయిన అసెంబ్లీ ఎన్నికలలో తుంగతుర్తి అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డ ప్రీతంకు బుజ్జగింపుల్లో భాగంగా అధిష్టానం ఈ భరోసా ఇచ్చినట్టు తెలుస్తుంది. దీనిపై ఇప్పటికే అధిష్టానం కసరత్తు పూర్తి చేసిందని సమాచారం. రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ గా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో అనేక దళిత ఉద్యమాల్లో ప్రితం పాల్గొన్నారు. ప్రీతంకు టికెట్ ఇస్తే గెలుపు నల్లేరు మీద నడకే అని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.