పరకాల (పీసీడబ్ల్యూ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి): పరకాల పట్టణంలో మహిళను వేధిస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. రేగొండ సర్పంచ్ భర్త అజయ్ (అంజి) తనను వేధిస్తున్నాడని ఓ మహిళ పరకాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి కథనం ప్రకారం.. ఈ నెలలో రెండుసార్లు రాత్రి 11 గంటల సమయంలో తాను నివాసముంటున్న గది వద్దకు వచ్చి తలుపులు బద్దలు కొట్టేందుకు ప్రయత్నించాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ నెల 5వ తేదీన మరోసారి వచ్చి సుమారు పది నిమిషాల పాటు తలుపులు బాదుతూ అసభ్య పదజాలంతో దూషించాడని తెలిపింది. ధైర్యం చేసి బయటకు వచ్చి ప్రశ్నించగా, తన మాట వినకపోతే అంతు చూస్తానంటూ బెదిరించాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై బాధితురాలు ఇప్పటికే పోలీసులను ఆశ్రయించింది. మహిళకు భద్రత కల్పించడంతో పాటు వ్యక్తిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. మహిళల భద్రత విషయంలో పోలీసులు తక్షణమే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.
