పరకాల: దమ్మున్న పత్రిక పేరు అడ్డుపెట్టుకొని బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఓ విలేకరిపై బాధితుడు పరకాల పోలీసులను ఆశ్రయించాడు. చిట్టీ డబ్బులు ఇవ్వాలని అడిగితే, తిరిగి డబ్బులు కోరిన సందర్భంలో సదరు విలేకరి బెదిరింపులకు దిగినట్లు బాధితుడు ఆరోపించాడు. “ఏమనుకుంటావో అనుకో.. ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకో” అంటూ హెచ్చరించినట్లు పేర్కొన్నాడు. ఈ ఘటనపై రెండు రోజుల క్రితం పరకాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పత్రిక పేరును అడ్డుపెట్టుకొని వ్యక్తులను బెదిరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించిన బాధితుడు, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరాడు. పత్రిక రంగానికి చెడ్డపేరు తెచ్చే ఇలాంటి వ్యవహారాలపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని బాధితుడు విజ్ఞప్తి చేశాడు.
