పరకాల, సెప్టెంబర్ 17 (పీసీడబ్ల్యూ న్యూస్):
విలేకరి వృత్తిని అడ్డుపెట్టుకుని కొంతమంది వ్యక్తులు అధికారులను బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు పరకాల పట్టణంలో చర్చనీయాంశంగా మారాయి. తమ ఉనికిని చాటుకునేందుకు ప్రభుత్వ అధికారులు, సిబ్బందిపై వరుసగా వార్తలు ప్రచురిస్తూ ఒత్తిడి తెస్తున్నారనే ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. సమస్యలను వెలుగులోకి తీసుకురావాల్సిన జర్నలిజాన్ని కొందరు వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయడం జర్నలిస్టు బాధ్యత. అయితే కొంతమంది వ్యక్తుల వ్యవహారశైలి మొత్తం విలేకరి వృత్తికే చెడ్డపేరు తెస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వార్తల పేరుతో బెదిరింపులు, డబ్బుల డిమాండ్లకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలపై అధికారులు, ప్రజల్లో చర్చ సాగుతోంది. ఈ వ్యవహారంపై ఇంటెలిజెన్స్, స్పెషల్ పోలీస్, పోలీస్ కమిషనరేట్ స్థాయిలో సమగ్రంగా విచారణ జరిపించాలని పరకాల పట్టణ ప్రజలు, కొంతమంది కౌన్సిలర్లు కోరుతున్నారు. నిజానిజాలను వెలికితీసి, విలేకరి వృత్తిని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నట్లు తేలితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో నిజాయితీగా ప్రజల కోసం పనిచేస్తున్న జర్నలిస్టులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని కోరుతున్నారు.
విలేకరి ముసుగులో బెదిరింపులా? వార్తల పేరుతో అధికారులపై ఒత్తిళ్లు.. బ్లాక్మెయిల్ ఆరోపణలు
