Friday, June 5, 2026

పక్కా మర్డర్..? షరీఫ్ ఉద్దీన్ మృతి వెనుక అసలు నిజాలు వెలుగులోకి రావాల్సిందే

పరకాల: పట్టణంలో ఇటీవల చోటుచేసుకున్న మహమ్మద్ షరీఫ్ ఉద్దీన్ అనుమానాస్పద మృతి కేసు రోజురోజుకు మరింత సంచలనంగా మారుతోంది. మొదట రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగినప్పటికీ, ప్రస్తుతం వెలుగులోకి వస్తున్న పరిస్థితులు, స్థానిక ప్రజల అనుమానాలు, కుటుంబ సభ్యుల వాదనలు ఈ ఘటన సాధారణ ప్రమాదం కాదని, పక్కా ప్రణాళికతో చేసిన హత్య కావచ్చనే అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే పరకాల పరిసర ప్రాంతాల్లో అక్రమ సంబంధాల నేపథ్యంలో జరిగిన దారుణ ఘటనలు ప్రజలను కలవరపరిచాయి. అలాంటి పరిస్థితుల్లోనే షరీఫ్ ఉద్దీన్ మృతి చోటుచేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పరకాల పట్టణ ప్రజలు, నడికూడ మండల వాసులు, చర్లపల్లి గ్రామస్థులు పెద్ద ఎత్తున స్పందిస్తూ ఈ ఘటన వెనుక వ్యక్తిగత కక్షలు, అక్రమ సంబంధాలు లేదా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివాదాలు ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. మృతుడు షరీఫ్ ఉద్దీన్ కుటుంబ పరిస్థితులు, అతని వ్యక్తిగత పరిచయాలు, చివరిసారిగా ఎవరితో ఉన్నాడు, ఘటన జరిగిన రోజున జరిగిన కదలికలు వంటి అంశాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ప్రమాదంగా చూపించే ప్రయత్నం జరిగిందనే అనుమానాలు కేసును మరింత కీలకంగా మార్చాయి. గాయాల స్వభావం, సంఘటన స్థల పరిస్థితులు, సేకరించిన సాక్ష్యాధారాలు అన్నింటినీ పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ కేసులో అసలు కారణం డబ్బు కోసమా? వ్యక్తిగత శత్రుత్వమా? లేక మరేదైనా స్వలాభ ప్రయోజనాల కోసమా? అనే ప్రశ్నలకు ఇంకా స్పష్టమైన సమాధానం లభించలేదు. అయితే ప్రజల్లో మాత్రం ఇది సాధారణ మరణం కాదనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. నిందితులు ఎంతటి తెలివిగా ఆధారాలు చెరిపివేయడానికి ప్రయత్నించినా, పోలీసులు నిజాలను వెలికితీయగలరనే నమ్మకాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై పి.సి.డబ్ల్యూ ప్రత్యేక ప్రతినిధి పరకాల సీఐ క్రాంతి కుమార్‌ను సంప్రదించగా, కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని తెలిపారు. ఇప్పటికే పలు కోణాల్లో విచారణ కొనసాగుతోందని, సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలు, అనుమానితుల కదలికలు, కాల్ డేటా తదితర అంశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. మరో రెండు రోజుల్లో కేసుకు సంబంధించిన కీలక వివరాలు వెల్లడించే అవకాశం ఉందని, నిందితులను గుర్తించి మీడియా ముందు ప్రవేశపెడతామని సీఐ స్పష్టం చేశారు. షరీఫ్ ఉద్దీన్ మృతి వెనుక ఉన్న అసలు కారణాలు ఏవైనా కావచ్చు. కానీ ఒక కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచిన ఈ ఘటనకు బాధ్యులైన వారిని చట్టం ముందు నిలబెట్టి కఠిన శిక్ష పడేలా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తుతో త్వరలోనే ఈ మిస్టరీకి తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related Articles

Latest Articles