పరకాల, ప్రత్యేక ప్రతినిధి: పరకాల పట్టణంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన కొంతమంది కౌన్సిలర్ల వ్యవహార శైలి ప్రస్తుతం ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ముందు “అన్న నమస్తే”, “అక్క నమస్తే”, “అమ్మ నమస్తే”, “బాపు నమస్తే” అంటూ ప్రతి ఇంటి గడప తొక్కిన నాయకులు, గెలిచిన తర్వాత మాత్రం ప్రజలకు అందుబాటులో లేకుండా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుంటామని, వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటామని హామీలు ఇచ్చిన కొందరు కౌన్సిలర్లు ప్రస్తుతం తామే పరకాల పట్టణానికి ఎమ్మెల్యేలు అన్నట్లు ప్రవర్తిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజలు సమస్యలతో వెళ్లినా పట్టించుకోవడం లేదని, ఫోన్ చేసినా స్పందించడం లేదని, కొన్నిచోట్ల అయితే ప్రజలతో అమర్యాదగా మాట్లాడుతున్నారని చెబుతున్నారు. ఇటీవల పట్టణంలోని ఒక వార్డులో చోటుచేసుకున్న సంఘటన దీనికి ఉదాహరణగా నిలుస్తోంది. ఆ వార్డుకు చెందిన ఓ ఓటరు తన ప్రాంత సమస్య పరిష్కారం కోసం కౌన్సిలర్‌ను సంప్రదించగా, “నాకు పుణ్యానికి ఓటు వేసినవా..? డబ్బులు ఇచ్చాం కదా.. మరి ఎందుకు పని చేయాలి అని అడుగుతున్నావు?” అన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యాఖ్యలు నిజమైతే అది ప్రజాస్వామ్య విలువలను అవమానించడమే కాకుండా ఓటర్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యగా భావించాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది అమ్ముకునే వస్తువు కాదు. ఓటరు తన సమస్యలు పరిష్కారమవుతాయని, అభివృద్ధి జరుగుతుందని నమ్మి ఓటు వేస్తాడు. గెలిచిన ప్రజాప్రతినిధి ఆ నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత కలిగి ఉంటాడు. కానీ కొందరు కౌన్సిలర్లు ఎన్నికల్లో గెలిచిన వెంటనే ప్రజలను మరచిపోయి అధికార మదంతో వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వార్డుల్లో డ్రైనేజీ సమస్యలు, వీధి దీపాల సమస్యలు, తాగునీటి ఇబ్బందులు, రోడ్ల దుస్థితి వంటి అనేక సమస్యలు ప్రజలను వేధిస్తున్నా వాటి పరిష్కారంపై దృష్టి సారించకుండా రాజకీయ ప్రదర్శనలకే పరిమితమవుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజలు సమస్యలు చెప్పడానికి వెళ్తే సరైన స్పందన లేకపోవడం వల్ల నిరాశకు గురవుతున్నారని చెబుతున్నారు. ప్రజాప్రతినిధులు ప్రజల సేవకులుగా ఉండాలి గానీ పాలకులుగా కాదు. ప్రజల ఓట్లతో గెలిచిన వారు ప్రజలకే జవాబుదారీగా ఉండాలి. ఎన్నికల సమయంలో ఓటర్ల చుట్టూ తిరిగి గెలిచిన తర్వాత వారినే తక్కువ చేసి మాట్లాడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ప్రజల ఆశయాలను నెరవేర్చడం, సమస్యలను పరిష్కరించడం, అందుబాటులో ఉండటం ప్రతి కౌన్సిలర్ ప్రధాన బాధ్యత. పరకాల పట్టణ ప్రజలు కూడా ఇప్పుడు తమ వార్డు అభివృద్ధి కోసం పనిచేసే నాయకులను, కేవలం హోదా కోసం రాజకీయాలు చేసే నాయకులను గుర్తించే స్థితికి చేరుకున్నారు. ప్రజల సహకారంతో గెలిచిన ప్రజాప్రతినిధులు ప్రజల గౌరవాన్ని కాపాడుకోవాలంటే అహంకారాన్ని విడనాడి సేవా దృక్పథంతో ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ప్రజలు ఇచ్చిన పదవి శాశ్వతం కాదు.. ప్రజల విశ్వాసమే నిజమైన బలం. దానిని కోల్పోతే పదవులు, హోదాలు కూడా నిలవవు.
