Friday, June 5, 2026

పరకాల బార్ అండ్ రెస్టారెంట్‌లో నాసిరకం ఆహారం సరఫరా చేస్తున్నారంటూ వినియోగదారుల ఆవేదన

పరకాల: పట్టణంలోని హుజురాబాద్ రోడ్డులో ఉన్న ఓ బార్ అండ్ రెస్టారెంట్ క్యాంటీన్‌లో నాణ్యతలేని ఆహార పదార్థాలు సరఫరా చేస్తున్నారని మద్యం ప్రియులు, భోజన ప్రియులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఒక రోజు లేదా రెండు రోజుల క్రితం తయారు చేసిన ఫుడ్‌ను మళ్లీ వేడి చేసి వినియోగదారులకు అందిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ కారణంగా అక్కడ భోజనం చేసిన కొందరికి అస్వస్థత, వాంతులు, కడుపు నొప్పులు వంటి సమస్యలు ఎదురవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. బార్ అండ్ రెస్టారెంట్‌లో పరిశుభ్రత ప్రమాణాలు కూడా సరిగా పాటించడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. వంటశాలలో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు శుభ్రంగా లేకపోవడం, వాడిన నూనెను మళ్లీ మళ్లీ ఉపయోగించడం, పాత చికెన్ మరియు ఇతర పదార్థాలతో వంటలు తయారు చేయడం వంటి చర్యలు జరుగుతున్నాయని పేర్కొంటున్నారు. రాత్రి వేళల్లో ఎక్కువగా కస్టమర్లు వస్తారనే కారణంతో పాత ఆహారాన్నే మళ్లీ సరఫరా చేస్తున్నారని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై పలుమార్లు యజమాన్యానికి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోయిందని బాధితులు తెలిపారు. “డబ్బులు తీసుకునేటప్పుడు మాత్రం మంచి సర్వీస్ ఇస్తామని చెబుతున్నారు. కానీ తినడానికి మాత్రం నాసిరకం ఫుడ్ ఇస్తున్నారు. మేము ఎన్నిసార్లు చెప్పినా యాజమాన్యం పట్టించుకోవడం లేదు” అని కొందరు వినియోగదారులు వాపోయారు. పట్టణంలో ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతున్న ఇటువంటి బార్ అండ్ రెస్టారెంట్‌లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు, మున్సిపల్ అధికారులు, ఎక్సైజ్ శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఫుడ్ నాణ్యత, వంటశాల పరిశుభ్రత, నిల్వ విధానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నారు. నాసిరకం ఆహారం సరఫరా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకొని వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే వ్యాపార సంస్థలపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తే భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని సామాజికవేత్తలు హెచ్చరిస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించి వాస్తవాలను వెలుగులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.

Related Articles

Latest Articles