Friday, June 5, 2026

మూఢనమ్మకాల పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న దుండగులపై చర్యలు తీసుకోవాలి

పరకాల, మే 26 పిసిడబ్ల్యూ న్యూస్: పరకాల మండలం నాగారం – తాళ్ల గ్రామాల మధ్య వెంకటాపురం వెళ్లే ప్రధాన రహదారిపై గుర్తు తెలియని వ్యక్తులు కోడిని తల కోసి బెల్లాన్ని ముద్దలుగా చేసి విస్తరాకులో పెట్టి నడిరోడ్డుపై వదిలిపెట్టిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఉదయం రహదారిపై వెళ్తున్న ప్రజలు ఈ దృశ్యాన్ని గమనించి భయాందోళనకు గురయ్యారు. కొందరు దీనిని మూఢనమ్మకాల చర్యగా భావిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం విజ్ఞాన శాస్త్రం వేగంగా అభివృద్ధి చెందుతున్న కాలంలో, రిమోట్‌తో రాకెట్లు నడిపే స్థాయికి ప్రపంచం చేరుకున్నప్పటికీ, ఇంకా కొంతమంది మూఢనమ్మకాల పేరుతో ప్రజలను భయపెట్టే ప్రయత్నాలు చేయడం బాధాకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు గ్రామీణ ప్రాంతాల్లో అమాయక ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ, భయాందోళనలకు గురిచేయడమే కాకుండా కుటుంబాలను మానసికంగా, ఆర్థికంగా కూడా నష్టపరిచే పరిస్థితులు తీసుకువస్తున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో కోళ్లు, నిమ్మకాయలు, గుమ్మడికాయలు లేదా ఇతర వస్తువులను రోడ్లపై పడేసి “చేతబడి”, “బాణామతి” వంటి మూఢనమ్మకాల ప్రచారానికి పాల్పడటం వల్ల ప్రజల్లో అపోహలు పెరుగుతున్నాయని తెలిపారు. ఇటువంటి చర్యల వల్ల చిన్నపిల్లలు, మహిళలు భయపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయని గ్రామస్తులు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు వెంటనే దృష్టి సారించి, ఇలాంటి మూఢనమ్మకాల ప్రచారానికి పాల్పడుతున్న వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గ్రామాల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, మూఢనమ్మకాల పట్ల చైతన్యం కల్పించాలని కోరుతున్నారు. సమాజంలో శాస్త్రీయ దృక్పథం పెంపొందించాల్సిన అవసరం ఉన్న ఈ సమయంలో, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Related Articles

Latest Articles