పిసి డబ్ల్యూ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి: పరకాల మండలంలో చేనేత సహకార సంఘాల ఎన్నికలకు సంబంధించిన ఓటరు జాబితా తయారీలో తీవ్ర అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని పరకాల మండల పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు దాసరి బిక్షపతి ఆరోపించారు. హన్మకొండ జిల్లా జౌళి శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, పారదర్శకత లేకుండా ఓటరు జాబితా రూపొందిస్తున్నారని విమర్శించారు. ఏప్రిల్ 18 నుండి 25 వరకు చేనేత కార్మికుల ఓటరు జాబితాను సంబంధిత సంఘాలు మరియు గ్రామ పంచాయతీ నోటీసు బోర్డులపై ప్రదర్శించాల్సి ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ప్రజలకు అందుబాటులో ఉంచలేదని తెలిపారు. దీనిపై అధికారులను సంప్రదించినప్పటికీ సరైన స్పందన లభించలేదని పేర్కొన్నారు. ప్రస్తుత చేనేత సంఘాల అధ్యక్షులతో అధికారులు కుమ్మక్కై పాత పాలకవర్గాన్నే కొనసాగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. సభ్యత్వం ఉన్న 150 మందిలో వాటా చెల్లింపులను కారణంగా చూపించి, తమకు అనుకూలంగా ఓటరు జాబితాను మార్చుతున్నారని అన్నారు. మరణించిన వారి పేర్ల స్థానంలో తమకు అనుకూల వ్యక్తులను చేర్చడం, చైర్మన్ కుటుంబ సభ్యులకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అక్రమాలు జరుగుతున్నాయని వెల్లడించారు. నాబార్డ్ మరియు ఇతర పథకాల ద్వారా వచ్చిన నిధుల దుర్వినియోగం బయటపడకుండా ఉండేందుకు కొత్త సభ్యులను అడ్డుకుంటున్నారని విమర్శించారు. గతంలో జియోట్యాగ్ నమోదులో కూడా ఇదే విధంగా అక్రమాలు జరిగాయని గుర్తు చేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మరియు జౌళి శాఖ అధికారులు స్పందించి, ఓటరు జాబితాలో జరిగిన అక్రమాలను సరిదిద్దాలని, టోల్ ఫ్రీ నెంబర్ ప్రకటించి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని దాసరి బిక్షపతి డిమాండ్ చేశారు.
