Saturday, June 6, 2026

ప్రియుడితో కలిసి భర్త హత్య… పరకాలలో సంచలనం

పిసిడబ్ల్యూ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి: హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో అదృశ్యమైన వ్యక్తి కేసు హత్యగా బయటపడింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో భార్య, ఆమె ప్రియుడు, తమ్ముడు కలిసి కిరాయి హంతకులతో భర్తను హత్య చేయించిన ఘటన సంచలనం రేపుతోంది. ఈ కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ శుక్రవారం వివరాలు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం… పరకాలకు చెందిన సుమన్ భరత్ (38)కు 2012లో లావణ్యతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. కొంతకాలంగా లావణ్యకు అదే ప్రాంతానికి చెందిన నరేష్‌తో సన్నిహిత సంబంధం ఏర్పడింది. ఈ విషయంపై దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. భర్త అడ్డంకిగా మారుతున్నాడని భావించిన లావణ్య, అతన్ని తొలగించుకోవాలని నిర్ణయించింది. దీనికోసం తమ్ముడు రాజు, ప్రియుడు నరేష్‌తో కలిసి పక్కా ప్రణాళిక రచించింది. ములుగు జిల్లా గోవిందరావుపేటకు చెందిన వెంకటేశ్వర్లుకు రూ.5 లక్షల సుపారీ కుదుర్చారు. డబ్బుల కోసం లావణ్య తన బంగారాన్ని తాకట్టు పెట్టింది. ప్రణాళిక ప్రకారం ఈ నెల 3న సుమన్‌ను మద్యం పేరుతో బయటకు పిలిపించారు. అక్కడికి తీసుకెళ్లిన అనంతరం మద్యం తాగించి మత్తులో ఉన్న సమయంలో బీర్ బాటిల్‌తో దాడి చేసి హత్య చేశారు. హత్య అనంతరం మృతదేహంపై పెట్రోల్ పోసి తగులబెట్టి ఆధారాలు చెరిపివేయడానికి ప్రయత్నించారు. ఘటనను వీడియోగా చిత్రీకరించి లావణ్యకు పంపినట్లు పోలీసులు తెలిపారు. తదుపరి రోజు కాలిపోయిన అవశేషాలను సమీప వాగులో పారేశారు. ఇక లావణ్యకు ఏమీ తెలియనట్లుగా ప్రవర్తిస్తూ ఇంటికి చేరుకుంది. ఏప్రిల్ 8న మృతుడి తండ్రి ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసుగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, సాంకేతిక ఆధారాల ద్వారా కుట్రను ఛేదించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నారు. ఘటన స్థలం నుంచి బూడిద, అస్థికలు, ఇతర ఆనవాళ్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు, నిందితుల వద్ద నుంచి ఆరు మొబైల్ ఫోన్లు సీజ్ చేశారు. ఈ కేసులో లావణ్య, నరేష్, రాజు, వెంకటేశ్వర్లు, రాకేశ్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన పరకాల ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.

Related Articles

Latest Articles