Saturday, June 6, 2026

గుడిపాడు, బంగ్లాపల్లి గ్రామాల్లో మోటర్లతో నీటి మళ్లింపు – పశువులకు తాగునీరు లేక ప్రజల ఆవేదన

మొగుళ్లపల్లి మండలం గుడిపాడు మరియు బంగ్లాపల్లి గ్రామాలలో చెరువుల నీటిని అక్రమంగా మోటర్ల ద్వారా పంట పొలాలకు మళ్లిస్తున్న ఘటనలు స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. గ్రామాల్లోని చెరువులకు కొందరు రైతులు మోటర్లు ఏర్పాటు చేసి నీటిని పెద్ద ఎత్తున పొలాలకు తరలించడంతో చెరువుల్లో నీటి మట్టం గణనీయంగా తగ్గిపోయిందని గ్రామస్థులు తెలిపారు. దీంతో గ్రామాల్లోని పశువులకు, ముఖ్యంగా గేదెలు, ఎద్దులు, ఇతర జీవాలకు తాగునీరు దొరకని పరిస్థితి నెలకొంది. వేసవి కాలంలో ఇప్పటికే నీటి కొరత తీవ్రంగా ఉండగా, ఈ విధమైన చర్యలు సమస్యను మరింత తీవ్రమయ్యేలా చేస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు తక్షణమే స్పందించి చెరువులకు మోటర్లు ఏర్పాటు చేసి నీటిని మళ్లిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అక్రమంగా ఏర్పాటు చేసిన మోటర్లను వెంటనే సీజ్ చేసి చెరువుల నీటిని సామూహిక అవసరాలకు ఉపయోగించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. గ్రామాల సమగ్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు తక్షణ చర్యలు తీసుకుని సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గుడిపాడు, బంగ్లాపల్లి గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Related Articles

Latest Articles