Tuesday, March 10, 2026

పిల్లల భద్రతే లక్ష్యం… డ్రగ్స్‌కు అడ్డుకట్ట వేయాలి

పరకాల, మార్చి 10 (పిసిడబ్ల్యూ న్యూస్):యువత భవిష్యత్తును కాపాడాలంటే డ్రగ్స్‌ వంటి మత్తు పదార్థాలకు అడ్డుకట్ట వేయడం అత్యంత అవసరమని పోలీసులు పేర్కొన్నారు. విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో పోలీసులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఏసీపీ సతీష్ బాబు ఆధ్వర్యంలో దాదాపు 500 మంది విద్యార్థులతో భారీ అవగాహన ర్యాలీ చేపట్టారు. పరకాల ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ అంబేద్కర్ సెంటర్ మీదుగా చైతన్య మోడల్ స్కూల్ వరకు కొనసాగింది. ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు “డ్రగ్స్‌కు నో చెప్పండి”, “మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి”, “ఆరోగ్యకరమైన సమాజం కోసం ముందుకు రండి” వంటి నినాదాలతో ప్రజల్లో చైతన్యం కల్పించారు. విద్యార్థులు పట్టణ ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహిస్తూ డ్రగ్స్‌ వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏసీపీ సతీష్ బాబు మాట్లాడుతూ మత్తు పదార్థాల వాడకం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని తెలిపారు. చిన్న వయసులోనే చెడు అలవాట్లకు లోనైతే విద్యార్థుల జీవితాలు దారి తప్పే ప్రమాదం ఉందని హెచ్చరించారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి చదువుపై దృష్టి సారించి మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలని సూచించారు. సమాజంలో డ్రగ్స్ వ్యాప్తిని అరికట్టేందుకు పోలీసులతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏసిపి తోపాటు సిఐ క్రాంతి కుమార్, ఎస్సై రమేష్ ఈగల్ ఫోర్స్, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. చైతన్య మోడల్ స్కూల్, శారద స్కూల్, విద్యాలయ స్కూల్‌కు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. డ్రగ్స్‌ నిర్మూలనలో యువత ముందుకు రావాలని పోలీసులు పిలుపునిచ్చారు.

Related Articles

Latest Articles