పరకాల: నాగర్ కర్నూలు జిల్లాలోని కుమ్మేర గ్రామంలో జరిగిన అమానుష ఘటనపై తెలంగాణ రజక సంఘాల సమితి ఉమ్మడి జిల్లాల యువజన విభాగం అధ్యక్షుడు మునుకుంట్ల నాగరాజు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ మల్లిఖార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా రజకులపై కులవివక్షతో ప్రవర్తిస్తూ, అనుమతి లేకుండా గుడిలోకి వచ్చారంటూ అసభ్య పదజాలంతో దూషించడం దుర్మార్గమని ఆయన ఖండించారు. రెండు నెలల పసిపాపను కాలితో తన్ని ప్రాణాలు తీసిన ఘటన అమానుషానికి పరాకాష్ట అని నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడవారిని కూడా అవమానిస్తూ దాడికి దిగడం సమాజం తలదించుకునే విషయం అని అన్నారు. అగ్రకుల అహంకారంతో రాచరిక ధోరణిలో వ్యవహరించిన వారిపై వెంటనే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పాప మృతికి కారణమైన నిందితులను అరెస్ట్ చేసి వేగవంతమైన విచారణ జరిపి గరిష్ట శిక్ష విధించాలని, బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయం అందించాలని నాగరాజు ప్రభుత్వాన్ని కోరారు. కుల వివక్షకు రాష్ట్రంలో స్థానం లేదని నిరూపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. “రజకుల గౌరవం కాపాడే వరకు మా పోరాటం ఆగదు” అని మునుకుంట్ల నాగరాజు హెచ్చరించారు.
