హనుమకొండ జిల్లా పరకాల పట్టణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పరకాల మున్సిపాలిటీ చైర్మన్‌గా పావుశెట్టి సునీల్ కుమార్‌ను అధికారికంగా ప్రకటించారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎన్నికైన కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఈ ప్రకటన వెలువడింది. ఈ సందర్భంగా పట్టణ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని సునీల్ కుమార్ స్పష్టం చేశారు. పట్టణంలో మౌలిక వసతుల మెరుగుదల, తాగునీరు, డ్రైనేజ్, రోడ్ల సమస్యల పరిష్కారం ప్రాధాన్యంగా తీసుకుంటానని ఆయన తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా పారదర్శక పాలన అందిస్తానని హామీ ఇచ్చారు. అన్ని వర్గాల ప్రజల సహకారంతో పరకాలను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానన్నారు.ఈ ప్రకటనతో పట్టణంలో రాజకీయ వర్గాల్లో చర్చలు జోరందుకున్నాయి. నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేస్తూ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
