Wednesday, July 22, 2026

పరకాల మునిసిపాలిటీ ఎన్నికల్లో ప్రలోభాల పర్వం

పరకాల, ఫిబ్రవరి 10 (పిసీడబ్ల్యూ న్యూస్): పరకాల మునిసిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో కొందరు కౌన్సిలర్ అభ్యర్థులు ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓటర్లను ప్రలోభాలకు లోనుచేయాలనే ఉద్దేశంతో డబ్బు, మద్యం, మాంసం పంచుతూ ఓటు హక్కును ప్రభావితం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
రాత్రి వేళల్లో ఇళ్లకు వెళ్లి నగదు పంపిణీ చేయడం, బహిరంగంగా మద్యం సరఫరా చేయడం, విందుల పేరుతో మాంసాహారం ఏర్పాటు చేయడం వంటి అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధమైన చర్యలు స్వేచ్ఛాయుత, న్యాయమైన ఎన్నికల ప్రక్రియకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ, అధికార యంత్రాంగం కళ్లప్పగించి ఉండటంపై విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల సంఘం తక్షణమే స్పందించి, ప్రలోభాలకు పాల్పడుతున్న అభ్యర్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
డబ్బు, మద్యం కాకుండా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే ఎన్నికల అజెండాగా ఉండాలని, ఓటర్లు కూడా ప్రలోభాలకు లోనుకాకుండా తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని మేధావులు పిలుపునిస్తున్నారు.

Related Articles

Latest Articles