పరకాల పట్టణ మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులు ఉండగా, ప్రతి వార్డులో కౌన్సిలర్ పదవుల కోసం దాదాపుగా వందమంది బరిలో నిలవడం రాజకీయ వాతావరణాన్ని మరింత ఉత్కంఠభరితంగా మార్చింది. నువ్వా నేనా అన్నట్టుగా పోటీ సాగుతున్న ఈ ఎన్నికల పోరాటం ఒక ఆటలా మారిందన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో పరకాల మున్సిపాలిటీ చైర్మన్ కుర్చీ ఈసారి అతి సామాన్యుడికే దక్కే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.నిరంతరం ప్రజల మధ్య ఉంటూ, వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, సేవాభావంతో పని చేసే వ్యక్తికే చైర్మన్ బాధ్యత అప్పగించాలని పరకాల పట్టణ ప్రజల్లో బలమైన విశ్వాసం నెలకొంది. కేవలం రాజకీయ అనుభవమే కాకుండా ప్రజల పట్ల నిబద్ధత ఉన్న నాయకత్వాన్ని పట్టణవాసులు ఆశిస్తున్నారు. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకెళ్తోంది. ఈ ఎజెండాను పరకాల మున్సిపాలిటీలోనూ అమలు చేయాలంటే ఈసారి మున్సిపల్ చైర్మన్ కుర్చీ మహిళకు దక్కితే బాగుంటుందని పట్టణ ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. మహిళా నాయకత్వం ద్వారా అభివృద్ధి, సంక్షేమం మరింత బలోపేతం అవుతుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.
