Saturday, March 7, 2026

పరకాల మునిసిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే లక్ష్యం – ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వ్యూహాత్మక అడుగులు

పరకాల పట్టణ మునిసిపాలిటీలో మొత్తం 22 వార్డులు ఉండగా, ప్రతి వార్డులో 5 నుంచి 10 మంది వరకు కౌన్సిలర్ అభ్యర్థులు బరిలో ఉండటం వల్ల రాజకీయ వాతావరణం నువ్వా నేనా అన్నట్లుగా మారింది. ప్రధాన పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న ఈ పరిస్థితుల్లో, అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పరకాల మునిసిపాలిటీలో పూర్తి ఆధిపత్యం సాధించాలనే స్పష్టమైన ఎజెండాతో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రత్యేక వ్యూహంతో ముందడుగు వేస్తున్నారు. 22 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తూ, ఒక్కో వార్డును సూక్ష్మంగా పరిశీలిస్తున్నారు. సీనియార్టీతో పాటు ప్రజల్లో ఉన్న ఆదరణ, స్థానికంగా ఉన్న అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ, అభ్యర్థులను ఫిల్టర్ చేసి బాధ్యతలు అప్పగించాలనే నిర్ణయంతో ముందుకు సాగుతున్నారు. ఏ ఒక్క వార్డుకూ అన్యాయం జరగకుండా, ప్రతి వర్గానికి న్యాయం జరిగే విధంగా అభ్యర్థుల ఎంపిక జరగాలన్నదే ఎమ్మెల్యే రేవూరి లక్ష్యంగా తెలుస్తోంది. పార్టీ శ్రేణులతో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేస్తూ, మునిసిపాలిటీ చైర్మన్ కుర్చీతో పాటు 22 కౌన్సిలర్ స్థానాలన్నింటిని గెలుచుకునే దిశగా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మరోవైపు ప్రజల్లో కూడా కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం పెరుగుతుండటం పార్టీకి కలిసొస్తున్న అంశంగా మారింది. అభివృద్ధి, సంక్షేమ పథకాలు, స్థానిక సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ పాత్రను గుర్తించిన ప్రజలు పార్టీ వైపే మొగ్గుచూపుతున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మొత్తంగా పరకాల మునిసిపాలిటీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా దూసుకుపోతోందన్న చర్చ పట్టణమంతటా జోరుగా సాగుతోంది.

Related Articles

Latest Articles