Saturday, March 7, 2026

రిజర్వేషన్ పేరుతో వార్డులు మారుతున్న నేతలు.. “మా వార్డుకు వస్తే కథ వేరే” అంటున్న ప్రజలు

పరకాల మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డుల్లో ఈసారి ఎన్నికల పోరు నువ్వా నేనా అన్నట్టుగా మారింది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోటీ తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతి వార్డులో రాజకీయ చర్చలు, వ్యూహాలు, లెక్కలు మరింత పదునెక్కుతున్నాయి. అయితే ఈ పోటీ మధ్యలో ఇప్పుడు ఒక పెద్ద సమస్య తెరపైకి వచ్చింది. అదే రిజర్వేషన్ కారణంగా గతంలో కౌన్సిలర్లుగా ఉన్న వారు తమ వార్డులను వదిలి పక్కవార్డుల్లో పోటీ చేసేందుకు ప్రయత్నించడం. రిజర్వేషన్ మార్పుల నేపథ్యంలో కొంతమంది మాజీ కౌన్సిలర్లు తమకు అనుకూలంగా ఉన్న వార్డులు కాకుండా, కొత్త వార్డులను ఎంచుకుంటూ రాజకీయ పావులు కదుపుతున్నారు. కానీ ఇదే సమయంలో స్థానికంగా ఆ వార్డుల్లో ఉన్న ప్రజలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. “మా వార్డుకు బయటి వ్యక్తులు వస్తే కథ వేరే ఉంటుంది” అన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. ఎన్నేళ్లుగా వార్డులో ఉంటూ సమస్యలు తెలిసిన వారికే అవకాశం ఇవ్వాలనే డిమాండ్ ఊపందుకుంటోంది.స్థానిక సమస్యలు, మౌలిక వసతుల లోపాలు, అభివృద్ధి అవసరాలు తెలిసిన వ్యక్తి కాకుండా కేవలం రాజకీయ లెక్కలతో వచ్చే నాయకులను ప్రజలు స్వీకరించేందుకు సిద్ధంగా లేరనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో పదవిలో ఉన్నామని, అనుభవం ఉందని చెప్పుకునే వారికంటే, తమ మధ్యే తిరిగిన, సమస్యల కోసం పోరాడిన వ్యక్తులకే ఈసారి ప్రజలు మద్దతు ఇవ్వాలనుకుంటున్నారు.ఈ పరిస్థితి పరకాల రాజకీయాల్లో కొత్త మలుపుగా మారింది. రిజర్వేషన్ పేరుతో వార్డులు మారుతూ రాజకీయాలు చేయడం ఇక అంత సులభం కాదని స్థానికుల స్పందన చెబుతోంది. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఈ అంశం మరింత వేడెక్కే అవకాశం ఉంది. చివరికి ప్రజల తీర్పు ఎటువైపు ఉంటుందో అన్నది ఆసక్తికరంగా మారింది.

Related Articles

Latest Articles