సి.ఐ.టి.యు ఆధ్వర్యంలో ఘనంగా బి.టి రణదీవె 34వ, వర్ధంతి
గార్ల: ప్రముఖ కార్మికోద్యమ నేత, సి.ఐ.టి.యు వ్యవస్థాపక అధ్యక్షులు బి.టి రణదీవె స్ఫూర్తితో కార్మికులు ఉద్యమించాలని సి.ఐ.టి.యు మండల కన్వీనర్ కందునూరి శ్రీనివాస్ పిలుపు నిచ్చారు. సిఐటియు వ్యవస్థపకులు బి.టి రణదీవె 34వ,వర్ధంతిని స్దానిక మంగపతిరావు భవనం లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రణదీవె చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ 1904 సంవత్సరంలో జన్మించిన రణదీవె ముంబై టెక్స్ట్ మిల్స్ లో కార్మికుల దుర్భర జీవితాలను చూసి వారి హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటాలు చేశారని,ఉన్నత విద్యను అభ్యసించినప్పటికి తన జీవిత కాలమంతా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జీవితాన్ని అంకితం చేసి ఆదర్శ కమ్యూనిస్టు గా నిలిచారని, ఎంపీగా గెలిచిన రణదీవె కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పార్లమెంట్‌లో గలమెత్తారని, 1970లో సి.ఐ.టి.యు నిర్మాణం లో ముఖ్య భూమిక పోషించి తొలి అఖిల భారత అధ్యక్షుడిగా ఎన్నికై దేశంలో జరిగిన అనేక కార్మిక పోరాటాలకు నాయకత్వం వహించారని తెలిపారు.మోడి అనుసరిస్తున్న కార్మిక వ్యతీరేక విధానాలను ప్రతిఘటించేందుకు కార్మీకులు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో సి.ఐ.టి.యు నాయకులు అంబటి వీరస్వామి,సైజాద్,సుధాకర్, శ్రీను,కోటయ్య,ప్రవీణ్,విజయ్, నవీన్,శ్రీనివాస్,రమేష్,నవీన్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.