రియల్ ఎస్టేట్ రోడ్డు కోసం ప్రధాన పంట కాలువ కట్ట కబ్జా..
చూసి చూడనట్లు ఇరిగేషన్ అధికారులు ఆందోళనలో ఆయకట్టు సాగు రైతులు మహబూబాబాద్ జిల్లా ఇల్లందు నియోజక వర్గం బయ్యారం మండల కేంద్రంలో భూములకు రేట్లు పెరుగడంతో పంట కాలువలకు నీరందించే కాలువలను కూడా రియల్టర్లు విడిచి పెట్టడం లేదు. బయ్యారం మండల కేంద్రంలోని గ్రామ సరిహద్దుల గుండా పోయే కాలువలు రియల్టర్లకు వరంగా మారాయి. ఇల్లందు– మహబూబాబాద్ ప్రధాన రహదారికి ఇరువైపుల ఉన్న వ్యవసాయ భూములను కొందరు రియల్టర్లు కొనుగోలు చేసి,వాటిని ప్లాట్లు చేసి విక్రయాలకు పాల్పడుతూ,ప్లాట్ల రోడ్డు కోసం బయ్యారం పెద్ద చెరువు సాగు దారులకు నీరందించే ప్రధాన పంటకాలువలను ( గుండ్లోరి కాలువ )గత కొంత కాలంగా యదేఛ్చగా ఆక్రమణలకు గురి అవుతున్నా,, పట్టించుకోవడం లేదని ప్రజలు, సాగు ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. బయ్యారం బస్టాండ్ సమీపంలో శనివారం ఎటువంటి అనుమతులు తీసుకోకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న కొంత మంది గుండ్లోరి పెద్ద కాలువ కట్టను ట్రాక్టర్ డోజర్ సహాయంతో సదును చేసి రోడ్డుగా తయారు చేస్తున్నారు. ప్రధాన కాలువ ఇరువైపుల కాలువ మద్యలో నుండి 16 ఫీట్లు ఉండవల్సి ఉండగా,కాలువ మట్టికట్టలను , కాలువలను ఆక్రమించి కాలువల మద్యలోనే సిమెంట్ నిర్మాణ పనులు, గత కొంత కాలంగా జరుగుతుండటం విశేషం , ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం వలన కాలువ కబ్జాలకు గురి అవుతున్నా, పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఇరిగేషన్ అధికారులు స్పదించి బయ్యారం చెరువు నుండి సాగు నీరు అందించే ప్రధాన కాలువలు కబ్జా చేసే వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకొని రైతుల సాగు భూములకు నష్టం వాటిల్లకుండా చూడాలని మండల రైతులు కోరుతున్నారు. దీనిపై ఇరిగేషన్ ఏఇ శ్రీకాంత్ వివరణ కోరగా కాలువ కట్ట మట్టిని తొలగించి రోడ్డు మార్గం వేసేందుకు డోజర్ వాడుతున్నట్లు మా దృష్టికి వచ్చిందని విషయం తెలుసుకొని మా లష్కర్ ను సంఘటనా ప్రాంతానికి పంపించినట్లు తెలిపారు . దీనిపై పై అధికారుల దృష్టికి తీసుక వెలుతామని బదులు ఇచ్చారు.