Friday, July 17, 2026

భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా హజ్రత్ సాధిక్ షా వలీ దర్గా ఉత్సవాలు

పిసిడబ్ల్యూ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి: పరకాల పట్టణ బస్టాండ్‌ ఎదుట ఉన్న ప్రముఖ హజ్రత్ సాధిక్ షా వలీ దర్గాలో వార్షిక ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఇస్లామిక్ క్యాలెండర్‌లో తొలి నెల అయిన మొహర్రం 29వ రోజు ఈ ఉత్సవాలను నిర్వహించడం గత 14 ఏళ్లుగా ఆనవాయితీగా కొనసాగుతోంది.ఈ సందర్భంగా దర్గాకు విచ్చేసిన భక్తులు హజ్రత్ సాధిక్ షా వలీ దర్గాలో పవిత్ర చాదర్ (గిలాఫ్) సమర్పించి, పూలతో అలంకరించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఖత్ముల్ ఖురాన్, సలాం, దువా, ఫాతిహా కార్యక్రమాలు నిర్వహించి, సమాజ శాంతి, ప్రజల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. హజ్రత్ సాధిక్ షా వలీ దర్గా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఈ దర్గాకు ముస్లింలతో పాటు హిందూ, క్రైస్తవ మతాలకు చెందిన భక్తులు కూడా పెద్ద సంఖ్యలో విచ్చేసి మొక్కులు చెల్లించడం విశేషం. భక్తులు తమ కోరికలు నెరవేరాలని ప్రార్థించి చాదర్లు సమర్పించడం, దువాల్లో పాల్గొనడం ఈ దర్గా ప్రత్యేకతగా భావిస్తారు. ఈ పవిత్ర స్థలంలో ప్రార్థనలు చేస్తే మనశ్శాంతి, ఆధ్యాత్మిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల విశ్వాసం.ఈ ఉత్సవాలను ఎలక్ట్రిక్ మేనేజింగ్ కమిటీ, పెద్దల కమిటీ ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. కార్యక్రమంలో సయ్యద్ గౌస్, ఎండీ నయీముద్దీన్, సయ్యద్ అక్రమ్‌తో పాటు కమిటీ సభ్యులు, పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారు.

Related Articles

Latest Articles