Saturday, June 6, 2026

పరకాల పట్టణ అభివృద్ధి ముందంజలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

పిసిడబ్ల్యూ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి: పరకాల పట్టణంలో ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన డ్రైనేజీ వ్యవస్థను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో అభివృద్ధి చేస్తోందని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో పట్టణంలోని పలు కాలనీలు, ప్రధాన రహదారుల వద్ద మోరీలు, డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో వర్షాకాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మురుగు నీరు రోడ్లపై నిల్వ ఉండటం వల్ల దుర్వాసన, దోమల వ్యాప్తి, రాకపోకలకు ఆటంకం ఏర్పడేది. ప్రస్తుతం ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి చొరవతో పరకాల పట్టణంలో అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా డ్రైనేజీ మోరీల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు మౌలిక వసతులు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న పనులను గుర్తించి ఒక్కొక్కటిగా పూర్తి చేయించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారుల వెంట నాణ్యమైన సిమెంట్ డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టడం ద్వారా భవిష్యత్తులో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ పనుల వల్ల ప్రజలకు సౌకర్యవంతమైన వాతావరణం ఏర్పడటమే కాకుండా పట్టణ సౌందర్యం కూడా మెరుగుపడనుంది. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ, అభివృద్ధి పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పట్టణ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. పరకాల పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.

Related Articles

Latest Articles