Saturday, June 6, 2026

పరకాలలో ప్రాపర్టీ టాక్స్ ఎగవేత..? రెండు ఫంక్షన్ హాల్స్‌పై అనుమానాలు

పిసిడబ్ల్యూ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి: హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో ప్రాపర్టీ టాక్స్ చెల్లింపుల విషయంలో అనుమానాస్పద పరిస్థితులు నెలకొన్నాయి. పట్టణంలో దాదాపు 12 ఫంక్షన్ హాల్స్ ఉండగా, అందులో రెండు ఫంక్షన్ హాల్స్ ఇప్పటివరకు ప్రాపర్టీ టాక్స్ చెల్లించలేదనే విషయం వెలుగులోకి రావడంతో ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు ఎందుకు చెల్లించకుండా కొనసాగుతున్నారనే ప్రశ్నలు స్థానిక ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి. పట్టణంలో చిన్న చిన్న వ్యాపారాలు, ఇళ్లు కలిగిన సామాన్య ప్రజలు సకాలంలో పన్నులు చెల్లిస్తుండగా, పెద్ద స్థాయి ఆదాయం వచ్చే ఫంక్షన్ హాల్స్ మాత్రం టాక్స్ చెల్లించకపోవడం అన్యాయమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి కార్యక్రమం, వేడుకల ద్వారా భారీగా ఆదాయం పొందే ఈ హాల్స్ పై పన్నులు వసూలు చేయడంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇన్ని రోజులు గడిచినా ఈ అంశంపై మున్సిపల్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం. దీని వెనుక ఎలాంటి ప్రభావశీలుల అండదండలు ఉన్నాయా? లేక అధికారుల నిర్లక్ష్యమా? అనే అనుమానాలు ప్రజల్లో తలెత్తుతున్నాయి. పారదర్శకతకు పెద్దపీట వేయాల్సిన ప్రభుత్వ వ్యవస్థలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం పట్ల పరకాల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజలు సంబంధిత అధికారులను వెంటనే స్పందించి, ప్రాపర్టీ టాక్స్ బకాయిలు ఉన్న ఫంక్షన్ హాల్స్‌పై సమగ్ర విచారణ చేపట్టి, తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వానికి రావలసిన ఆదాయాన్ని కాపాడడం ప్రతి పౌరుడి బాధ్యత. అదే విధంగా అధికారులు తమ బాధ్యతలను నిర్వర్తిస్తూ సమానత్వం పాటించాల్సిన అవసరం ఉందని ప్రజలు స్పష్టం చేస్తున్నారు. ఈ వ్యవహారం పై ఉన్నతాధికారులు దృష్టి సారించి నిజానిజాలు వెలికితీయాలని పట్టణ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

Latest Articles