పరకాల పట్టణ కేంద్రం నేడు రంగుల వేడుకతో ఇంద్రధనస్సులా మారింది. హోలీ వేడుకల్లో జర్నలిస్టులు ఉత్సాహంగా పాల్గొని ఐక్యతకు నిదర్శనంగా నిలిచారు. ప్రేమ, ఆప్యాయతలతో పరస్పరం రంగులు చల్లుకుంటూ “కలిసి ఉంటేనే బలం” అనే సందేశాన్ని అందించారు. ఈ వేడుకల్లో మునిసిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్, కమిషనర్ అంజయ్య, ఎస్సై పవన్ పాల్గొని జర్నలిస్టులతో కలిసి రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. అధికార యంత్రాంగం మీడియా కలిసి వేడుకల్లో పాల్గొనడం ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకల్లో వివిధ రాజకీయ పార్టీల నాయకులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. డప్పుల చప్పుల్లతో నృత్యాలు చేస్తూ పట్టణంలో ఊరేగింపు నిర్వహించారు. కుల, మత భేదాలకు అతీతంగా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని హోలీ సంబరాలను మరింత రంజుగా మార్చారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ రంగుల్లో మునిగితేలగా, పరకాల పట్టణం ఒక్కసారిగా పండుగ వాతావరణంతో కళకళలాడింది. జర్నలిస్టుల ఐక్యత, ప్రజా ప్రతినిధుల పాల్గొనడం ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హోలీ పండుగ ఆనందం, సోదరభావం, సమగ్రతకు ప్రతీక అని పలువురు అభిప్రాయపడ్డారు. సమాజంలో శాంతి, సఖ్యతలు నెలకొనాలని ఆకాంక్షిస్తూ ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలియజేశారు. రంగుల పండుగ పరకాలలో ఐక్యత రంగులు నింపింది.
