పరకాల: పట్టణం బస్టాండ్ సమీపంలో ఉన్న ఓ ప్రముఖ గోల్డ్ లోన్ బ్యాంకు యాజమాన్యంపై కస్టమర్లు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. రుణాల మంజూరు ప్రక్రియలో పారదర్శకత లేకుండా ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. బ్యాంకు టార్గెట్లను చేరుకునే క్రమంలో అమాయక కస్టమర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బంగారం కుదువ పెట్టుకొని రుణం తీసుకునే సమయంలో సౌకర్యంగా వ్యవహరించే సిబ్బంది, రుణం పూర్తిగా చెల్లించి బంగారం తిరిగి తీసుకునేందుకు వచ్చినప్పుడు మాత్రం పలుమార్లు రేపు రా, మాపురా అంటూ తిప్పిస్తున్నారని బాధితులు చెబుతున్నారు. ముఖ్యంగా రూ.10 లక్షలకు పైగా రుణం తీసుకున్న కస్టమర్లు రుణం క్లియర్ చేసినప్పటికీ, బంగారం విడుదలలో వారం రోజుల వరకు ఆలస్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా, ఒకరి బంగారాన్ని మరొకరి బంగారంతో కలిపి రుణాల మంజూరులో అక్రమాలు జరుగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల కొంతమంది కస్టమర్లు అదనపు వడ్డీ భారం మోస్తున్నారని పేర్కొంటున్నారు. ఈ విషయమై పలుమార్లు యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా స్పందన లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు విచారణ జరిపి, కస్టమర్లకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. గోల్డ్ లోన్ సంస్థలపై పర్యవేక్షణను కట్టుదిట్టం చేసి, పారదర్శక విధానాలు అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
