Saturday, March 7, 2026

కాంగ్రెస్ పేరుతో రాజకీయ ఆటలు? నలుగురిపై సస్పెన్షన్ వేట.

పరకాల, ఫిబ్రవరి 8 (పిసిడబ్ల్యూ న్యూస్): పరకాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరిస్తూ, పార్టీ సభ్యులుగా కొనసాగుతూనే పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తూ ఇతర రాజకీయ పార్టీలకు మద్దతు ఇస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకున్నట్లు పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్ ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు. ఆదివారం పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు, పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా వ్యవహరించిన కొంతమందిని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 6వ వార్డుకు చెందిన పల్లె బోయిన నరేష్, గువ్వా క్రాంతి, 13వ వార్డుకు చెందిన బొచ్చు శ్రీధర్, 11వ వార్డుకు చెందిన దుప్పటి సాంబశివుడు పార్టీ శ్రేణుల్లో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఇతర పార్టీలకు బహిరంగంగా సహకరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, నాయకత్వం, నిర్ణయాలకు కట్టుబడి పనిచేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని, పార్టీ క్రమశిక్షణను అతిక్రమించే వారిని ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే భవిష్యత్తులో కూడా ఇలాంటి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పరకాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా, నిజాయితీగా పనిచేసే కార్యకర్తలతో ముందుకు సాగుతామని, పార్టీపై నిబద్ధత లేని వారిపై కఠినంగా వ్యవహరిస్తామని కొయ్యడ శ్రీనివాస్ తెలిపారు.

Related Articles

Latest Articles