Saturday, March 7, 2026

చేతి గుర్తుతో అభివృద్ధి హామీ… రాంనగర్‌లో సదన్ కుమార్‌కు వెల్లువెత్తిన మద్దతు

పరకాల, ఫిబ్రవరి 7 (పిసిడబ్ల్యూ న్యూస్): పరకాల పట్టణం మున్సిపాలిటీలోని 22 వార్డుల్లో కౌన్సిలర్ ఎన్నికల హోరు తారస్థాయికి చేరుకుంది. ప్రతి వార్డులోనూ నువ్వా నేనా అన్నట్టుగా ప్రధాన పార్టీలు పోటీపడుతూ రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ పోటీ కోణంలో 11వ వార్డు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి గూడెల్లి సదన్ కుమార్ ప్రజల్లో విశేష స్పందనతో ముందుకు సాగుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాంనగర్ కాలనీలో సదన్ కుమార్ విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాలనీలో అడుగుపెట్టిన ప్రతి చోట కాంగ్రెస్ జెండాలు ఎగురుతూ, చేతి గుర్తుకు మద్దతుగా ప్రజలు నినాదాలు చేశారు. యువత, మహిళలు, వృద్ధులు స్వచ్ఛందంగా ప్రచారంలో పాల్గొని సదన్ కుమార్‌కు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా సదన్ కుమార్ మాట్లాడుతూ “ప్రజాసేవ చేయడమే నా జీవిత లక్ష్యం. రాజకీయాలు పదవుల కోసం కాదు… ప్రజల కోసం. గెలిచిన వెంటనే 11వ వార్డును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తాను. నా వార్డు ఓటర్లకు చేదోడు వాదోడుగా నిలుస్తూ, ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతాను” అని స్పష్టం చేశారు. డ్రైనేజీ, సీసీ రోడ్లు, తాగునీరు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు. సదన్ కుమార్ మాటల్లో స్పష్టత, ఆచరణలో నిజాయితీ కనిపిస్తోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రజల మధ్యే పెరిగిన నాయకుడిగా, వార్డు అవసరాలు తెలిసిన వ్యక్తిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. గత పాలకుల నిర్లక్ష్యానికి విసిగిపోయిన ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటూ కాంగ్రెస్ అభ్యర్థి వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది.
ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా కార్యకర్తలు, యువ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని సదన్ కుమార్‌కు అండగా నిలిచారు. రాంనగర్ కాలనీ అంతటా కాంగ్రెస్ శ్రేణుల ఉత్సాహం కనిపించగా, 11వ వార్డులో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్న నమ్మకం పార్టీ శ్రేణుల్లో బలంగా వ్యక్తమవుతోంది.

Related Articles

Latest Articles