Saturday, March 7, 2026

బీసీ మహిళ రిజర్వేషన్ వార్డుల్లో రచ్చ.. టికెట్లపై పార్టీల్లో ఒత్తిళ్లు

పరకాల పట్టణ మునిసిపాలిటీలో రాజకీయ వాతావరణం రోజురోజుకీ వేడెక్కుతోంది. మొత్తం 22 వార్డులు ఉన్న ఈ మునిసిపాలిటీలో దాదాపుగా వందకు పైగా అభ్యర్థులు బరిలో నిలవడానికి సిద్ధమవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు, స్వతంత్ర అభ్యర్థులు కూడా భారీ సంఖ్యలో పోటీలో ఉండటంతో ప్రతి వార్డు నువ్వా నేనా అన్నట్టుగా మారింది. ముఖ్యంగా బీసీ మహిళలకు రిజర్వేషన్ ఉన్న వార్డులలో పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. సీనియార్టీ ఉన్న మహిళా నేతలతో పాటు, ఎమ్మెల్యే ఎన్నికలకు ముందు ఆయా పార్టీల్లో చేరిన కొత్త నాయకత్వానికి కూడా టికెట్లు ఇవ్వాలని ఆయా వర్గాలు బలంగా డిమాండ్ చేస్తున్నాయి. పార్టీ కోసం కష్టపడ్డ వారికే అవకాశాలు ఇవ్వాలన్న అభిప్రాయం ఒకవైపు ఉంటే, ఇటీవల చేరిన వారిని ప్రోత్సహించాలన్న ఒత్తిడి మరోవైపు పెరుగుతోంది. ఈ పరిస్థితితో పార్టీల అధిష్టానాలు ఎవరికి టికెట్ ఇవ్వాలనే అంశంపై తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. ఒకే వార్డులో ఐదు నుంచి పది మందివరకు ఆశావహులు ఉండటంతో అసంతృప్తులు బయటపడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తంగా పరకాల మునిసిపాలిటీ ఎన్నికలు ఈసారి కేవలం స్థానిక పోటీగా కాకుండా పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. అభ్యర్థుల ఎంపికే ఎన్నికల ఫలితాలను నిర్ణయించే కీలక అంశంగా మారుతుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Related Articles

Latest Articles