Saturday, March 7, 2026

ప్రధాన పార్టీలతో పాటు రెబల్ అభ్యర్థులతో పెరిగిన పోటీ

పరకాల పట్టణంలో మున్సిపాలిటీ చైర్మన్ కుర్చీ కోసం రాజకీయ వేట మొదలైంది. 22 వార్డులు కలిగిన పరకాల. మున్సిపాలిటీలో ఈసారి ఎన్నికలు గతంలో ఎప్పుడూ లేని విధంగా తీవ్ర పోటీ వాతావరణంలో సాగనున్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రతి వార్డులో ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర, రెబల్ అభ్యర్థులు కూడా బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఒకో వార్డులో ఐదు నుంచి పదిమంది వరకు అభ్యర్థులు రంగంలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. చైర్మన్ పదవి దక్కించుకోవాలనే ఆశతో అనేక మంది నాయకులు ముందస్తు వ్యూహాలు రచిస్తున్నారు. వార్డుల వారీగా సామాజిక సమీకరణలు, రిజర్వేషన్ అంశాలు, స్థానిక సమస్యలను ఆధారంగా చేసుకుని అభ్యర్థుల ఎంపిక జరుగుతున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు కూడా ఈసారి పరకాల మున్సిపాలిటీపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. గెలుపే లక్ష్యంగా భారీగా ఖర్చు చేయడానికి కొందరు సిద్ధంగా ఉన్నారనే చర్చ పట్టణంలో నడుస్తోంది.
రిజర్వేషన్ కారణంగా గతంలో ఒక వార్డుకు ప్రాతినిధ్యం వహించిన కొంతమంది నాయకులు ఇప్పుడు ఇతర వార్డులపై దృష్టి పెట్టడం, అక్కడ స్థానికుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొనే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. “మా వార్డుకు బయటి వ్యక్తులు వస్తే సహించం” అన్న భావన కొన్ని ప్రాంతాల్లో బలంగా వ్యక్తమవుతోంది. ఇది ఎన్నికల సమయంలో తీవ్ర రాజకీయ వేడికి దారితీసే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు, పట్టణ అభివృద్ధి, తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుద్ధ్యం వంటి సమస్యలే ఈ ఎన్నికల్లో ప్రధాన అజెండాగా మారనున్నాయి. చైర్మన్ పదవి ఎవరి చేతిలోకి వెళ్తుందన్నది మాత్రమే కాకుండా, పరకాల భవిష్యత్తు అభివృద్ధికి ఎవరు సరైన నాయకత్వం ఇస్తారన్న దానిపై ప్రజలు చర్చించుకుంటున్నారు.
మొత్తంగా చూస్తే, పరకాల మున్సిపాలిటీ ఎన్నికలు ఈసారి కేవలం వార్డు స్థాయి పోటీగా కాకుండా, చైర్మన్ కుర్చీ కేంద్రంగా మారిన రాజకీయ సమరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీలు, రెబల్ అభ్యర్థులు, స్వతంత్రులు అందరూ బరిలో దిగడంతో ఎన్నికల వాతావరణం రోజు రోజుకీ మరింత ఉత్కంఠభరితంగా మారుతోంది.

Related Articles

Latest Articles