పరకాల పట్టణంలో మున్సిపాలిటీ చైర్మన్ పదవి చుట్టూ రాజకీయ చర్చలు వేగం పెంచుకున్నాయి. ఈ పదవి కోసం కొంతమంది నాయకులు ప్రస్తుతం తాజా మరియు మాజీ ఎమ్మెల్యేల వద్ద ఆశీర్వాదం పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని పట్టణ రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. పదవి కోసం పెద్ద నాయకుల వద్ద లాబీయింగ్ చేస్తున్న వారి కదలికలు స్థానికంగా కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ చర్యల పట్ల ప్రజల్లో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక ప్రజలు మాత్రం చైర్మన్ పదవి పరకాల అభివృద్ధికి కష్టపడ్డ, ప్రజల మధ్యే తిరిగిన, సమస్యల కోసం పని చేసిన వ్యక్తికి రావాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ముదిరాజ్ కులానికి చెందిన మాజీ కౌన్సిలర్ పేరు ప్రజల్లో బలంగా వినిపిస్తోంది. ఆయన పరకాల పట్టణంలో ఎన్నో సంవత్సరాలుగా ప్రజలతో నేరుగా మమేకమై పనిచేయడం, సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడూ ముందుండడం, పదవి లేకుండా కూడా పట్టణ అభివృద్ధికి చిత్తశుద్ధితో సహకరించడం స్థానికులకు గుర్తుండిపోయిన అంశాలుగా చెబుతున్నారు.ఈ మాజీ కౌన్సిలర్‌ను చైర్మన్ చేస్తే పట్టణానికి మేలు జరుగుతుందని ప్రజల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. పరకాల మున్సిపాలిటీకి అవసరమైన నాయకుడు ప్రజల కష్టాలు తెలుసుకున్న, స్థానిక పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి కావాలని చాలా మంది స్పష్టం చేస్తున్నారు. బాహ్య నాయకుల వద్ద లాబీయింగ్ చేస్తూ వచ్చిన వ్యక్తి కన్నా, పట్టణ ప్రజల నమ్మకంతో ఎదిగిన నాయకుడే ఈ పదవిని అందుకోవాలని స్థానిక వర్గాలు కోరుకుంటున్నాయి.పదవి కోసం జరుగుతున్న రాజకీయ కదలికలతో పోలిస్తే ప్రజల భావజాలం పూర్తిగా భిన్నంగా ఉందని స్పష్టమవుతోంది. పరకాల అభివృద్ధి దృష్ట్యా సరైన నాయకత్వం కావాలి అని ప్రజలు చెబుతుండగా, మాజీ కౌన్సిలర్ పేరుతో విస్తృత చర్చ జరగడం రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీల అంతర్గతంగా ఇంకా అభ్యర్థులపై స్పష్టత రాలేనప్పటికీ, పట్టణ ప్రజల ఆశలు మాత్రం ఆ మాజీ కౌన్సిలర్ వైపే మొగ్గుచూపుతున్నాయి.
