Saturday, March 7, 2026

పరకాల మహిళా డెయిరీ ఏర్పాటుకు సత్వర చర్యలు చేపట్టాలి

హనుమకొండ: పరకాల మహిళా డెయిరీ ఏర్పాటుకు కావాల్సిన చర్యలు సత్వరంగా అధికారులు తీసుకోవాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు.శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో పరకాల మహిళా డెయిరీ ఏర్పాటు, నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలపై హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్, డాక్టర్ సత్య శారద, పలు శాఖల జిల్లా అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళా డెయిరీ భవన నిర్మాణం, పాల సేకరణ, డెయిరీ ద్వారా పాలు సరఫరా, మౌలిక వసతుల కల్పనకు తీసుకోవాల్సిన చర్యలు గురించి ఎమ్మెల్యే, కలెక్టర్లు, ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ మహిళా డెయిరీ ఏర్పాటుకు సంబంధించిన వివిధ అంశాలపై ఆయా శాఖల అధికారులు సమన్వయంతో త్వరగా చర్యలు చేపట్టాలన్నారు. మిల్క్ సెంటర్ల ఏర్పాటు, రవాణా, సొసైటీ ఏర్పాటు, మార్కెటింగ్, చెల్లింపులు, తదితర అంశాలపై ప్రణాళిక రూపొందించాలన్నారు.ఈ సమావేశంలో హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల డీఆర్డీవోలు మేన శ్రీను, కౌసల్య దేవి, సహకార అధికారులు సంజీవ రెడ్డి, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీనివాస్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles