పరకాల, ఆగస్టు01 (పిసిడబ్ల్యూ న్యూస్): పరకాల మండలంలోని వెల్లంపల్లి గ్రామానికి చెందిన పెండెల స్వర్ణలతకు శనివారం ఉదయం ప్రసవ వేదనలు ప్రారంభమవడంతో కుటుంబ సభ్యులు ఆమెను పరకాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం హనుమకొండలోని మిషన్ ఆసుపత్రికి 108 అంబులెన్స్‌లో తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆమె సుఖప్రసవం చేసింది. అంబులెన్స్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి సురక్షితంగా ప్రసవం నిర్వహించారు. అనంతరం తల్లి, నవజాత శిశువును చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు 108 అంబులెన్స్ పైలట్ అర్జున్, ఈఎంటీ (టెక్నీషియన్) భాస్కర్ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో 108 సేవలు మరోసారి ప్రాణరక్షకంగా నిలిచాయని స్థానికులు అభినందించారు.
