పిసిడబ్ల్యూ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి: హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు ప్రజా సమస్యలను పక్కనపెట్టి పరస్పర విమర్శలు, ప్రెస్ మీట్ల రాజకీయాలతో కాలక్షేపం చేస్తున్నాయని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నాయకుడు శనిగరపు రాజు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.ఇటీవల నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కుట్టుమిషన్ల పంపిణీ అంశాన్ని ప్రస్తావిస్తూ మాట్లాడిన నేపథ్యంలో, బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ ప్రెస్ మీట్ నిర్వహించారని ఆయన గుర్తు చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఎదురుదాడిగా ప్రెస్ మీట్లు పెట్టడం జరిగిందని అన్నారు. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ రెండూ ఒకే తీరుగా వ్యవహరిస్తూ ప్రజల అసలు సమస్యలను గాలికొదిలేశాయని విమర్శించారు. పరకాల పట్టణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదల, పారిశుద్ధ్య సమస్యలు, నిరుద్యోగం, తాగునీటి సమస్యలు వంటి కీలక అంశాలపై దృష్టి పెట్టాల్సిన నాయకులు వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలకే పరిమితమవుతున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతోందని బీఆర్ఎస్ విమర్శిస్తోందని, అయితే పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసిన అభివృద్ధి ఏమిటో కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని శనిగరపు రాజు ప్రశ్నించారు. ప్రజలు ఇప్పుడు మాటలు కాదు, పనులు కోరుకుంటున్నారని అన్నారు. పరకాల పట్టణంలోని అనేక వార్డుల్లో చెత్త పేరుకుపోవడం, మురికి కాలువలు శుభ్రం కాకపోవడం, రోడ్ల సమస్యలు తీవ్రంగా ఉండటం వంటి అంశాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రతి వీధిలో పారిశుద్ధ్య లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ అధికార, ప్రతిపక్ష నాయకులు వాటిపై దృష్టి సారించడం లేదని విమర్శించారు. ఇకనైనా కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు మానుకుని ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని కోరారు. పరకాల పట్టణ అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టి ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా కృషి చేయాలని సూచించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలని, రాజకీయ ప్రచారాల కంటే ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకే ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా బీఎస్పీ నాయకుడు శనిగరపు రాజు డిమాండ్ చేశారు.
