పరకాల, జూన్ 15 పిసిడబ్ల్యూ న్యూస్: ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని అధికారులు సమర్థవంతంగా అమలు చేయాలని పరకాల రెవెన్యూ డివిజనల్ అధికారి వెంకన్న అన్నారు. సోమవారం పరకాల ఆర్డీవో కార్యాలయంలో ఆయన అధ్యక్షతన ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పరకాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని వివిధ శాఖల డివిజన్ స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ప్రజల నుండి వచ్చిన సమస్యలు, ఫిర్యాదులు, వినతిపత్రాలను అధికారులు స్వీకరించి సంబంధిత అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 11 అర్జీలు అందగా, వాటిని సంబంధిత శాఖల అధికారులకు పంపించారు. ప్రతి అర్జీని నిర్దేశిత గడువులోగా క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల మేరకు పరిష్కరించాలని ఆర్డీవో వెంకన్న అధికారులను ఆదేశించారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారి సమస్యలకు సత్వర పరిష్కారం అందించడమే ప్రజావాణి కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఆయన తెలిపారు. అలాగే ప్రజలకు సంబంధించిన సమస్యలను అధికారులు నిర్లక్ష్యం చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదును ప్రాధాన్యతగా తీసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది మరియు అర్జీదారులు పాల్గొన్నారు.
