Thursday, June 18, 2026

రెవెన్యూ డివిజన్ అధికారులతో ఆర్డీవో సమీక్ష సమావేశం

పరకాల, జూన్ 16 (పీసీడబ్ల్యూ న్యూస్): పరకాల రెవెన్యూ డివిజనల్ అధికారి మంగళవారం పరకాల రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో డివిజన్ పరిధిలోని మండలాల తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, గిర్దావర్లు, సర్వేయర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భూ భారతి కార్యక్రమం అమలు, సదాబైనామా దరఖాస్తుల పరిష్కారం, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు, మీ సేవ ద్వారా సర్టిఫికెట్ల జారీ, రెవెన్యూ సేవల మెరుగుదల వంటి పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆర్డీవో వెంకన్న మాట్లాడుతూ, ప్రజలకు అందిస్తున్న రెవెన్యూ సేవలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా, సమర్థవంతంగా అందించేందుకు అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే భూ సంబంధిత సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం ప్రదర్శించకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో రెవెన్యూ సిబ్బంది కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా ప్రతి అధికారి కృషి చేయాలని సూచించారు. సమావేశంలో డివిజన్ పరిధిలోని వివిధ మండలాల రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles