పరకాల, అక్టోబర్ 9 (పిసిడబ్ల్యూ న్యూస్): పరకాల మండలం కామారెడ్డిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న భూముల రీ-సర్వే ప్రక్రియను జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి, పరకాల రెవెన్యూ డివిజనల్ అధికారి డి.ఎస్. వెంకన్న శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ సరిహద్దులు, భూములకు సంబంధించిన వివరాలు, ఇప్పటివరకు చేపట్టిన సర్వే పురోగతిపై సర్వే సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రీ-సర్వే సందర్భంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, సర్వే ప్రక్రియపై ముందస్తు సమాచారం అందిస్తూ పారదర్శకంగా, సమన్వయంతో కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. రీ-సర్వే విజయవంతంగా పూర్తయ్యేందుకు రైతులు అధికారులకు, సర్వే సిబ్బందికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పరకాల తహసీల్దార్ టి. విజయలక్ష్మి, మండల సర్వేయర్ విజయ్ కుమార్, అదనపు గిర్దావర్ ఖయ్యూం, గ్రామ పాలన అధికారి లావణ్య, సర్వే సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
